Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సురవరం ప్రతాపరెడ్డి

77

మున్నగు వారు తమ కోర్కెలు ఫలింపజేయుదురని ఆశించుచున్నారు అట్టి యెడ స్వదేశీయుల ఆలోచన వారికెటుల గిట్టును? లెస్లిస్కాటు మున్నగు వారు తమ దేశమునకనుకూలించు విధానమునే జొప్పించుటకు ప్రయత్నించెదరు కాని, భారతీయుల మేలుకై వారేల పాటుపడెదరు? బ్రిటిషు సైన్యములు సంస్థానములను రక్షించుటకవసరమని ఆంగ్లేయ పత్రికలు వ్రాయుచుండుట లేదా?

ఒక విషయము మాత్రము జ్ఞప్తియందుంచుకొన వలయును. పూర్వము స్వదేశ ప్రభువుల మూలముననే భారత జాతి దాస్య శృంఖములలో బడినది. ఇపుడు శృంఖములను ద్రెంపుటకై కృషి సలుపుచుండ మఱల సంస్థానాధీశులే అడ్డు తగులుచున్నారు. భారతీయులు వీరి దృక్పధమును కీర్తింపజాలరు. స్వదేశీయుల గౌరవము వలననే వీరి కీర్తి యినుమడించును గాని పాశ్చాత్యులకు దాసులగుటచే కాదు. అయినను పెక్కు సంవత్సరముల నుండి వేరొక జాతికి లోబడి యున్నవారికి స్వతంత్ర భావములెట్లు కలుగును ?