Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సురవరం ప్రతాపరెడ్డి

71

కాని రాష్ట్రవాసులలో నిట్టి మనోసంస్కార మింకను జరుగలేదు. రాష్ట్రపు సంస్కార మహాసభ యొకటి యున్నను దాని కార్యక్రమ మంతయు హిందీలోనో, మహారాష్ట్రముననో జరుగుచుండుటచే దాని గూర్చి యాంధ్రులలో నుత్సాహము ప్రబలుటలేదు ఆ సభా తీర్మానములు పామర జనులకు తెలియుట లేదు అందుచే ఆంధ్రజన ప్రజాభిప్రాయ మొకటి (Public opinion) కలుగుట లేదు దీనివలన సంస్కార సూత్రము లామోదించువారు సహితము, తదనుగుణముగ ప్రవర్తించుటలేదు. అందుచే రాష్ట్రీయాంధ్రులలో సంస్కార సూత్రములను వెదజల్లుటకొక సంస్కార సభ యవసరము అందు జరిగెడు తీర్మానములు ఆంధ్ర లోకమంతటికిని వెల్లడియగును. ఆ తీర్మానములకు ప్రజాభిప్రాయ ప్రోద్బలముండును గానవాని నమలు జరుపు యాంధ్రు లందరికిని తప్పనిసరి యగును

మూడవది ఆంధ్ర యువక మహాసభ ఆంధ్రుల భావ్యోన్నతి వీరి పైననే యాధారపడి యున్నది. నేటి యువకులే రేపటి పౌరులు. సంఘ దురాచారముల నడుగంట వలెనన్నను, వాఙ్మయము నవీన కళలతో శోభించవలెనన్నను, ఆంధ్రజాతి శక్తిమంతమై, సారవంతమై, ఆత్మవిశ్వాసము, స్వాతంత్ర్య దీక్ష, దేశభక్తిగలిగి పేరు గాంచవలెనన్న యువకులే నడుముగట్టి కార్యరంగమున కురకవలెను ఈ బాధ్యతను తెలిసికొనుటకును, సాధనములలు యుటకుగాను, రాష్ట్రీయాంధ్ర యువకుల సభ యొకటి గావలసి యున్నది

ఈ సభలను వైభవముతో జరుపుటకు సమయము చాలినంత లేదు అయినను నిరుత్సాహపడక పట్టుదలతో పని జేసినచో సభలు విజయవంతముగ మాత్రము జరుగకపోవు హైద్రాబాదు యువకమండలి వారివిషయమై ప్రబల యత్నములను సలుపుచునేయున్నారు. సూర్యాపేటాహ్వాన సంఘమువారు శ్రద్దవహించిన చాలును మండలి సహాకారముగాని, శక్తివంచనలేక కృషి సల్పినచో తప్పక జయము చేకూరును ఈ సభలవలన రాష్ట్రీయాంధ్రులలో నొక నూతన చైతన్యము గలుగునని మా దృడనమ్మకము కాబట్టి ఆహ్వానసంఘమువారు సంశయములను వెనుకకు ద్రోసి, వెంటనే కార్యసాధనమునకు పూనుకొందురని హెచ్చరించుచున్నాము.