Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

66

గోలకొండ పత్రిక సంపాదకీయాలు

ఐదేకళాశాలలున్నవి. దీనిలో నొకటి స్త్రీల కళాశాల, ఈ స్త్రీల కళాశాలలో 3 గురు విద్యార్ధినులు చదువు చున్నారు ఈ ఐదింటిపై 5 లక్షలు ఖర్చు పెట్టినారు. ఇందు చదువు విద్యార్థుల సంఖ్య 1000 వీరిపై యింతమొత్తము వ్యయమగు చున్నది. అనగా ప్రతి విద్యార్ధిపై 459 రూపాయలు ఖర్చగుచున్నది. కాని హైస్కూలులోని ప్రతి విద్యార్థిపై 11-6-2 మాత్రమే ఖర్చగుచున్నది అనగా ఒక కళాశాల విద్యార్థిని చదివించు ఖర్చులో 40 ప్రైమరీ విద్యార్ధులను చదివించ వచ్చును. ఇట్లు చూపించుటవలన ఉత్తమ విద్య (Higher education) కూడదని మా యభిప్రాయముకాదు దానితో పాటుగా ఖాన్గీ పాఠశాలలపై కోపగించుకొనునట్లు కాక ప్రైమరీ పారశాలలపై యెక్కుడు శ్రద్ధవహించి విద్యావ్యాపకము చేయవలెనని మేము హెచ్చరించుచున్నాము

ఈ రాష్ట్రములో వెలువడినట్లుగా స్త్రీవిద్య మరి ఎచ్చటను వెలువడియుండ లేదు. ఈ నివేదిక కాలమున చదువుచుండిన బాలికల సంఖ్య 34 వేలు మాత్రమే స్త్రీ విద్యను వృద్ధి పరచిననే కాని రాష్ట్రములో విద్యాపరిస్థితులు చక్కబడవు. ఇట్లుచేయవలయుననిన రాష్ట్రీయ భాషలగు తెనుగు, మరాఠీ, కన్నడములలోనే స్త్రీలకు బోధచేయవలెను ఇప్పుడు నగరమందుండు పాఠశాలలో సహితము బాలికలకు తమ తమ మాతృభాషలో విద్యనేర్చు, సరియైన నేర్పాటులు లేనప్పుడు జిల్లాలలో నెవరడుగుదురు ఎంతవరకు రాష్ట్రీయ భాషలకు ప్రాధాన్య మొసగరో యంతవరకు విద్యావంతుల సంఖ్య యిట్లే యుండును

ఈ సందర్భమున ప్రజలకు గూడా తమ కర్తవ్యమును సూచింపవలసి యున్నది రైతుల నుండి ప్రతి గ్రామమందును తమ పన్నులతో బాటుగా లోకల్పండు పన్ను అని రూపాయికి 1 అణా చొప్పున వసూలు చేయుదురు ఆ యణాలో 3 పైసాలు (నాల్గవ భాగము) విద్యకని సర్కారు వారు ఏర్పాటు చేసి యున్నారు ఈ ద్రవ్యమును ప్రతి గ్రామమందును సంపూర్ణముగా వినియోగించునట్లు రైతులు చూచుకొనవలయును

అడుగనిది అమ్మయైన పెట్టదు సర్కారు వారు తమ ప్రజలు వృద్ధికి రావలెననియే నిరంతరము తాము పాటుపడుచున్నామని చెప్పుచుందురు. అట్టిచో మన యభివృద్ధికి కారాణములగు విషయములందు మనమేల సర్కారు వారిదృష్టిని ప్రసరింప జేయకూడదు?