స్త్రీ విద్యా మహాసభ
15 - 2 - 1928
స్త్రీల యభివృద్ధి యెడ నానాటికి శ్రద్ధ హెచ్చుచుండుట సంతోషకరము. అందును, తమ అభివృద్ధికై పురుషులపైననే ఆధారపడియుండక, స్త్రీలు తమంతట తామే ప్రయత్నములు సలుపుచుండుట ప్రశంసార్హము, శుభకరము. కొలదికాలమునుండి, ప్రతి యేడును ఏదియో యొక స్త్రీల సమావేశము జరుగుచునే యున్నది. తీర్మానములలో తమ ఆశయములను, కోరికలను ప్రకంటిచుచు సంఘమున సంచలనము కలిగించుచునే యున్నారు. కానీ తదితర సమావేశముల కంటె మొన్నటి ఢిల్లీ సమావేశము కొన్ని విషయములలో నెగడదగినది. అలీగఢ్ విశ్వవిద్యాలయమునకు వైస్ ఛాన్సలర్‌ను, స్త్రీల అభ్యున్నతికై, విద్యా వ్యాప్తికై నిరంతర కృషి సలుపుచున్న భోపాలు మహారాణిగారీ సమావేశమునకు అధ్యక్షత వహించుట యెంతయు అదృష్టమనవచ్చును. అదియును గాక పాశ్చాత్య విజ్ఞాన పారీణయగు ఇర్విను ప్రభ్వి తమ అమూల్యమగు సందేశము నొసగి, ఈ సమావేశ సమాలోచనములకు వన్నెదెచ్చిరి. భారతదేశమందలి వివిధ ప్రాంతముల నుండి ప్రతినిధులు విచ్చేసి ఈ సభ యందు పాల్గొని, విపుల చర్చ యనంతరము గావింపబడిన తీర్మానములకు విలువను అపాదించిరి
స్త్రీలకు విద్య అత్యవసరమనియు, విద్యా వ్యాప్తికి పలు భాషలు, పేదరికము, అజ్ఞానము, ఉపేక్ష, ప్రతికూల ప్రజాభిప్రాయము, సాంఘిక నడతలు, ఆచారములు, రాజకీయములు, అంతరాయములు కల్పించుచున్న వనియు, బాల్యవివాహము, పరదాపద్ధతి నిరసించవలెననియు, ధృవపరుచుటలో విశేషమేమియు లేదు ఇవి యందరికి తెలిసిన విషయములే ఇందు ప్రశంసింప దగిన దేమియు లేదు.
ఈ సమావేశమును ముఖ్యముగా మూడు విషయములకై మేము అభినందించుచున్నాము. అందు మొదటిది బాలికలకు నిర్బంధ ప్రాధమిక విద్య ముఖ్యమని నిర్ధారణ చేయుచు, దీనికై ప్రభుత్వము వారిని, స్థానిక సంఘము