ఆంధ్ర మహాజన సభ
16-11-1927
ఈ మహాజన సభ అనంతపురములో శ్రీయుత ఒ. లక్ష్మణస్వామి గారి యాజమాన్యమున సమావేశమయినది. అధ్యక్షుల ప్రారంభోపన్యాసము భావగర్భితమై ఒప్పుచున్నది ఆంధ్ర మహాసభ ఏర్పడి పదునైదు సంవత్సరములు గడచినను ఆంధ్ర సభల యుద్దేశము పూర్తికానులేదని వీరు నిరూపించిరి. ఆంధ్ర రాష్ట్ర సమస్య యింకను పరిష్కరింపబడలేదు. చిత్తూరు జిల్లా వారికిగల అభిప్రాయభేదములు త్వరలో తొలగిపోయి ఆంధ్ర రాష్ట్ర నిర్మాణము జరుగునని తలచెదము ఈ విషయమై ఆంధ్ర మహాసభ శ్రద్ధవహించవలసి యున్నది. ఆంధ్రులలో వివిధ రాజకీయ పక్షములున్నను ఈ విషయమై అందరు ఏకాభిప్రాయులై ప్రయత్నించెదరని నమ్మెదము
రెండవది ఆంధ్ర విశ్వవిద్యాలయము. విశ్వవిద్యాలయ కార్యాలయము స్థాపింపబడి ఒక సంవత్సరము గడచిపోయినను ఇంకను ప్రత్యేక విద్యా విధానము ఆచరణకు రానులేదు. విశ్వవిద్యాలయ కార్యస్థానము గూర్చియే తగవులాట జరుగుచున్నది ప్రతి ప్రాంతము వారును తమ ప్రాంతమునకే కార్య స్థానమున్న గౌరవము లభించవలెనని పోరాడుచున్నవారే కానీ మొత్తము పైన అన్ని ప్రాంతముల ఆంధ్రుల అందుబాటులో నుండవలయునని విచారించుట లేదు. ఇకనయినను కాల హరణము చేయక సభ్యులు తగు నిర్ణయము చేయుదురు గాక!
అధ్యక్షులగు లక్ష్మణస్వామి గారు ఆంధ్రోద్యమము ద్వారా గ్రంథాల యోద్యమము విరివిగా వ్యాపించినదనియు ఇక ముందు ఆంధ్ర వికాసమునకు ఇట్టి సంస్థలే మూలాధార మనియు వాక్రుచ్చిరి ఆంధ్ర మహాసభ ఆంధ్రుల సర్వతోముఖాభివృద్ధి కొరకు పాటుపడవలయు ననియు, ఆంధ్రుల ప్రత్యేక