సురవరం ప్రతాపరెడ్డి
37
వెడలి యీ విద్యను చదివి వచ్చిన వారెందరో ఇపుడు కలరు. ఇపుడు దేశమునకు వారి అవసరము లేదనియే చెప్పవచ్చును. వైద్యమునందు ఎం.బి.సి.ఎం. ఉన్నత పరీక్షకు కూడ హిందూ స్థానమునందు శిక్షణ నొసంగబడుచున్నది. అట్టి యున్నత వైద్య పరీక్షలలో కడతేరి కొన్నాళ్ళు అనుభవము సంపాదించి ప్రత్యేక విషయమును గూర్చి ఇంకను తెలిసికొనవలయునన్న సీమకు వెడలుట యుపయోగ కరమే.
ప్రస్తుతము భారతీయులు పరిశ్రమల యందును, ఇంజనీరింగు, సైన్సు యందును ప్రవీణులు గావలసియున్నది. దేశసంపద అభివృద్ధి పరచుటకీ విద్యలే మూలాధారములు. అన్ని దేశముల వారి కన్న మనము పరిశ్రమల యందు వెనుకబడి యున్నాము. విదేశీయులు చిన్న చిన్న వస్తువుల సిద్ధపరచి కోట్లకొలది ధనమార్జించుచుండ మనము యుద్యోగములకొరకు పెనుగులాడుచున్నాము. వారిచే తయారు చేయబడిన వస్తువుల జీవితావసరములుగా జేసికొని వారికి దాసులమై జీవితముల గడుపుచున్నాము. మన దేశమునందు మిక్కుటముగ పండుచున్నట్టి ముడి పదార్థముల విదేశములకు చౌకధరలకు ఎగుమతిచేసి వాని వలననే తయారు కాబడిన వానికి హెచ్చు వెలల నొసంగి గైకొను చున్నాము. పరిశ్రమలయందు మనము నిపుణులమై యున్న ఇట్టి ముడి వస్తువుల నుండి యెన్నియో అవసర పదార్థములు సిద్ధపరచి లాభము పొందవచ్చును గదా! వారి దేశములకు పోయి మనము నేర్వదగినది ముఖ్యముగా యీ విద్యలే. ప్రస్తుతము దేశమునకు కావలసినవి ఇవియే. ఆర్థిక స్వాతంత్ర్యమున కివియే, మూలాధారములు. కాన సీమకు వెళ్ళు విద్యార్థులు పూర్వాభిప్రాయములు విడచి తమకును, దేశమునకును లాభకరమగు విద్యల నార్జించుట శ్రేయస్కరము లేనిచో వీరు వెచ్చించు వేల కొలది ధనము వృధా యనదగును. స్వదేశమునందే యుండుట మేలు కనుక పై విద్యార్థులందరును ఆలోచించెదరు గాక.
యౌవనులగు వీరందరకును ఈశ్వరుడు ఆరోగ్యమును ప్రసాదించి వీరి ఉత్తమోద్దేశములను నెరవేర్చి పిమ్మట సులభముగ స్వస్థలముల జేర్చుగాక యని ప్రార్థించుచున్నాము.వీరు తమ దేశమునకవసరమగు పాశ్చాత్య విద్యల నభ్యసించి దేశమును, దేశీయులను, దేశ సంప్రదాయములను సదా దృష్టియందు వుంచుకొని, దేశసేవకై ద్విగుణీకృతోత్సాహముతో కృతార్థులై మరలివత్తురని నమ్ముచున్నాను.