Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సురవరం ప్రతాపరెడ్డి

33

గురించినట్టియు, సర్వ జనైక్యతను గురించినట్టియు, అస్పృశ్యతా మద్యపాన బాల్య వివాహ శుల్కాది దోష నివారణ విషయికముల గురించినట్టియు, మున్నగు తీర్మానములు సర్వసాధారణములైనవే. ఒకటి రెండు తీర్మానములు విశేషముగా చర్చింపబడెను. అందు విధవా వివాహమొకటి. దీని విషయమై విశేష కాలము వాదోపవాదములు జరిగెను. తుదకు బహుజనాంగీకారముగా వితంతూద్వాహము అందు ముఖ్యముగా బాల వితంతూ వివాహములు అంగీకరింపబడెను.

హైదరాబాదు రాష్ట్రమునకు సంబంధించిన తీర్మానములు సభవారు చేయుట చాల యుక్తముగా నున్నవి. ఖాన్గీ పాఠశాలల శాసనమును బహిరంగ సభల నిరోధించు శాసనమును, రద్దు చేయవలయునని యీ సభ కోరెను. "గ్రంథాలయ వార్షికోత్సవములను ఆపివేసినందులకీ సభవారు తీవ్రముగా ఆక్షేపించుచున్నారు." -ఈ తీర్మానము సూర్యాపేట సభల విషయమైనది. గ్రంథాలయ ఉద్యమమును రాజకీయమునకే సంబంధమును లేనిది. బరోడా వంటి సంస్థానమీ యుద్యమమునకు చేయుచున్న సహాయము బ్రిటిషిండియా యందును కానరాదు. ఇట్టి వానిని నిరోధించుట జ్ఞానమును నిరోధించుటయై యున్నది. ఈ నిరోధములు ముందు వుండకూడదని సభ కోరుట చాల సమంజసము.

భైక్షుక వృత్తిని నిరోధించు శాసనమును గురించి మా పత్రికలో నిదివరకే మా యభిప్రాయము నిచ్చియుంటిమి. ఇది చాలా యవసరమైనది. దేశమందీ మూలమున ప్రబలిన సోమరితనమును ఫలవంతమగు మార్గములందు ప్రసరింపజేయుట దేశ దారిద్ర్యమును పోగొట్టుట యగును.

మొత్తము పైన తీర్మానము లన్నియు దీర్ఘ సమాలోచనా ఫలితములని చెప్పునొప్పు. సభా కార్యక్రమములు చక్కగా జరిగెను. కానీ వానిని ఆచరణ యందుంచుట యొక్కటి మిగిలిన పని. ఇచ్చట మన లోపము విశేషము. వేయి సులభముగా చెప్పవచ్చును గాని యొక్కటి సక్రమముగా దీక్షతతో నాచరించుట కష్టము. మనలో కార్య దీక్షతకు మనము ప్రాముఖ్యత నొసగు వరకు మనకు గౌరవము కలుగదు. ఈ సభ వారు దేవీ చౌధురాణి గారి యధ్యక్షతతో జరుపుటచే ఈ రాష్ట్రవాసులలో గొప్ప సంచలనము కలిగించిన వారైరి.