హిందూ సంఘ సంస్కార మహా సభ
15-6-1927
హైద్రాబాదులో మొన్న జరిగిన ఆరవ హిందూ సంఘ సంస్కార సభా చర్యలు పేరుచో ముద్రింపబడి యున్నవి. ఈ మహా సభ అత్యుత్తమముగా, జయప్రదముగా జరుపబడెననుటలో సందేహము లేదు. సభా భవనము నగర వాసుల చేతను, జిల్లాల నుండి వచ్చిన వారిచేతను పూర్తిగా నిండియుండుట ప్రజలందు కలుగుచున్న మార్పును సూచించుచున్నది. మరియు సభా తీర్మానములను శ్రద్ధతో విని వాని నామోదించుటలో మన రాష్ట్రపు జనుల సత్వరాభివృద్ధిని సూచించుచున్నది.
ఆహ్వాన సంఘాధ్యక్షుల యొక్కయు యధ్యక్షురాలు యొక్కయు, నుపన్యాసములు చాల బోధ ప్రదములైనవి. ఆహ్వాన సంఘ అధ్యక్షులయిన శ్రీయుత రామచంద్ర నాయకుగారు హైద్రాబాదులోని పరిస్థితులను, తామెట్లు రాజకీయ సభలను చేయజాలరో, తమకెట్లు విద్యా మతాది విధానములందు విశేషాధికారములు కావలయునో సూచించిన విషయములన్నియు ముఖ్యముగా గమనింపదగినవి. అధ్యక్షురాలగు సరళాదేవి చౌధరాణిగారి యుపన్యాసము గంభీర భావ గర్భితమైనది. ప్రతి వాక్యమును దీర్ఘాలోచనకు తావిచ్చునది. బ్రాహ్మణుల ధర్మమును వారు చూపి చెప్పిన విషయములు వారు స్వయముగా బ్రాహ్మణి యగుట చేతను, సత్యాధారములగుట చేతను నిరసింపబడక ప్రశంసింపబడెను. "బ్రాహ్మణత్వమునకు మారుగా నెప్పుడు బ్రాహ్మణుడే సంఘ నాయకుడయ్యెనో అప్పుడే పతన మారంభమయ్యెను”. ఇత్యాది వాక్యములు ఎంత తీక్ష్ణముగా నున్నను వానిలోని గంభీర భావమును గ్రహించుట అవసరము.
ఈ సంఘ సంస్కార మహా సభా తీర్మానములు అనేకములు హిందూస్థానమందన్ని ప్రాంతములందును జరుగునన్ని సంస్కార సభలలో ప్రవేశపెట్టబడి సాధారణముగా నామోదింపబడునట్టివి. స్త్రీ విద్యా వ్యాపకత్వమును