Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

గోలకొండ పత్రిక సంపాదకీయాలు

నొక కార్యాలయము ఏర్పరుపబడెను.మునుపటివలెగాక ఎన్నికల పద్ధతి ఏర్పరుప వలయుననియు, (1)శాసన నిర్మాణము (2) ప్రశ్నోత్తరములు (3) తీర్మానములు (4) ఆదాయ వ్యయ నిర్ణయము మున్నగునవి శాసన నిర్మాణసభ యందు ప్రవేశపెట్టవలయు ననియు, కొలది సంఖ్యగల జాతుల హక్కుల కాపాడుటకు వలయు జాగరూకతలు నిర్ణయింపవలయు ననియు శ్రీవారి ఫర్మాను శాసించినది. దీని ప్రకారము వెంటనే కార్య స్థాన మొకటి ఏర్పడి సంవత్సరము కంటె ఎక్కువ కాలము పనిచేసి, వివిధములగు అంకెలను, సంగతులను తయారుచేసి రెండు సంపుటములచ్చు వేసి ప్రభుత్వము వారికి నివేదిక (రిపోర్టు) యుక్తముగ నర్పించిరి. సర్ అలీ ఇమాంగారు కూడ ఈ విషయమున తమ నివేదిక కూడ వ్రాసిరట. కాని పైవానిలో నేవియు ప్రకటింపబడలేదు.

కాని ఏమి కారణమో, 1334 ఫసలి వరకు పర్యవసాన మేమియు తేల లేదు. ఈ వత్సరమున మహా ఘనత వహించిన ప్రభువు గారు మరల నీ విషయమున నొక యువ సంఘమును (ముగ్గురు సదరల్‌ముహాములును దివాన్ బహద్దరు జి. కృష్ణమాచార్యులును సభా సదులుగా గల దానిని) ఏయే రాజ్యాంగ సంస్కరణము లవసరమో నిర్ణయించి నివేదిక పంపుటకు దయాపూర్వకముగా నేర్పరచిరి. ఈ సంఘము వారు తమ నివేదిక నొక మాసము దినములలోనే ప్రభువు గారి ఆజ్ఞానుసారము ప్రభుత్వ సభ కంపిరి. ఇది జరిగియు నేటికి రెండు వత్సరములు దాటినది.

సుమారునాల్గు మాసముల క్రింద మన మహారాజా సర్ కృష్ణ ప్రసాదు బహాదురు గారు ప్రభుత్వ సభాధ్యక్షులైన తరువాత జరిగిన శాసన నిర్మాణ సభయొక్క మొదటి సమావేశమున, మౌల్వీ మహమ్మదు అస్గర్ బి. ఏ.; బారిస్టరెట్లా గారు రాజ్యాంగ సంస్కరణముల యావశ్యకతను శాసన సభాసదుల పక్షమున మహారాజా గారి యెదుట వ్యక్తీకరింపగా, మహారాజా బహాదరు గారు ఈ ముఖ్య విషయమును గూర్చి "సానుభూతితో నాలోచింతు" మని వాగ్దాన మొనర్చిరి.

కొన్ని మాసముల క్రింద బ్రిటిషు హిందూ దేశపు ఆంగ్ల పత్రికలు కొన్ని మన ప్రభువు గారిని గూర్చియు బ్రిటిషు ప్రభుత్వము వారు మన రాజ్యాంగములో జోక్యము కలిగించుకొన నిశ్చయించినారనియు అసత్య