Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజ్యాంగ సంస్కరణములు

4-5-1927

ఆధునిక కాలమున నిజాం రాష్ట్రము నందు రాజ్యాంగ సంస్కరణములు మహా ఘనత వహించిన నిజాం ప్రభువుగారి 16 దై 1326 ఫసలినాటి ఫర్మానుతో ఆరంభమైనవని చెప్పవచ్చును. ఈ ఫర్మాను అసాధారణ (గైరు మామూలి) జరీదా మూలమున ప్రకటించబడి యుండెను. శ్రీవారి ఈ ఫర్మాను వలన గలిగిన ముఖ్యమైన మార్పు యేదనగా, అంతకు పూర్వము ఎంతోకాలము నుండి రాజ్యాంగ సూత్రములన్నియు ప్రధాన మంత్రి యందు కేంద్రీకరింపబడి యుండ నా పద్ధతి దేశాభివృద్ధికి బాగుగా నుండదని శ్రీవారు తమ ఘన బుద్ధియందు నిశ్చయించి రాజ్యపాలనమునకై యొకసభ, "ప్రభుత్వ సభ” (బాబెహుకూమతు) అనుదాని నేర్పరచి దానికధ్యక్షునిగా విఖ్యాతులగు సర్ అలీ ఇమాంగారిని నియోగించి సభానియమములు, అధికారములు, అధ్యక్షుని ప్రత్యేకాధికారములు వివరముగా నిర్ణయించిరి. ఇదే ఫర్మాను చివర శ్రీవారు "మేము మా అమీరులను, అధికారులను, ప్రియ ప్రజలను ఈ క్రొత్త రాజ్యాంగ పద్ధతిని జయ ప్రదముగా జేయుదురుగాక యని కోరుచున్నాము" అని సెలవిచ్చిరి. ఈవిధమున శ్రీవారు పరిపాలనమున తమ ప్రజలకు సంబంధము, కలిగించు మహోద్దేశమును సూత్రప్రాయముగా జూపిరి.

తరువాతి సంవత్సరముననే శ్రీవారు మరియొక ఫర్మాను ప్రభుత్వ సభాధ్యక్షుని పేర జారీచేయించిరి. ఇది ప్రజా శ్రేయములను శ్రీవారు గౌరవింపదలచి, బ్రిటిషు హిందూ దేశములోని ఉత్తము ప్రజా ప్రాతినిధ్య పద్ధతిని మన శాసన నిర్మాణ సభయందు ప్రవేశ పెట్టగోరి ప్రకటింపబడినదై యున్నది. హైద్రాబాదు శాసన నిర్మాణ సభను బ్రిటిషు హిందూ దేశము నందలి శాసన నిర్మాణ సభల కేవిధముగను దీసి పోకుండ నుండునట్లు సంస్కరించుటకై అవసరమగు అంకెలను సంగతులను కూర్చి ప్రోవుచేయుటకు రాయ్ బాలముకుందుగారి యాజమాన్యమున