Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సురవరం ప్రతాపరెడ్డి

11

మారుగా స్వార్థ పరాయణత్వము, సంకుచిత స్వభావము, పరాధీనత పెంపొందించు చున్నవి. శైశవ దశలో నున్న ఆంధ్ర విశ్వ విద్యాలయ మీ కొఱతల సరకు గొని, సంస్కరించి స్వధర్మ నిర్వహణమునకును, ఆత్మోపలబ్ధకిని ననుకూలించు నిజమగు విద్య నొసగి జాత్యభ్యుదయమునకు పాటు పడునని నమ్ముచున్నాము.

విద్యా విధానముగూర్చి సర్ బ్రజేంద్ర నాథ్ సీల్‌గారి సూచన లెంతయు మాననీయములు. ప్రాచ్య పాశ్చాత్య విద్యా వికాసముల మేళగించి, బాలురకు శిక్ష నొసగుట ఇప్పుడు మన సమస్యయై యున్నది. బ్రహ్మచర్యము,గురుకులము మొదలగు విధానముల కాలము పోయినది. అయినను ఆ విధానములోని గూఢమైయున్న భావములను, ఆశయములను మనము విసర్జింపరాదు. వానిని గొని, మన భిన్న పరిస్థితుల కన్వయించి, సానుకూలముగా, శుభప్రదముగా మన విద్యా విధానము నెఱపవలెను. ఈ సందర్భమున సీలుగారొక నూతన విషయమును సూచించియున్నారు. విద్యావిధానము వృత్తికిని స్థానిక పరిస్థితుల కనుగుణ్యముగా నుండునటుల నుండవలెనని వారి సలహా. దీని గూర్చి యెల్లరు నాలోచించుట యెంతయు నవసరము. ప్రత్యేక కళలకును, పరిశ్రమలకు ప్రత్యేక సదుపాయము లుండును. ఆ ప్రాంతపు బాలుర కా ప్రాంతపు కళలను గాని, నేర్చుకొనుట సులభముగా నుండును. మఱియు నా కళలు గాని పరిశ్రమలుగాని వృద్ధియగుట కెక్కువ యవకాశముకూడ నుండును. ఈ యంశమును విద్యాభివృద్ధియందును తద్వ్యాప్తియందు నభిమానులందఱు నాలోచింతురు గాక!