Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లోకమాన్యుడు

4-8-1926

ఆధునిక కాలమున భారత వర్ష రంగమున నద్వితీయ విఖ్యాతితో తన పాత్రమును బ్రదర్శించిన మహా పురుషులలో లోకమాన్య బాలగంగాధర తిలక్‌ను మించిన వారు వేరొకరు లేరని చెప్పినచో అందతిశయోక్తి యుండదు. గడచిన 1 ఆగస్టు నాటితో నీ భారత పుత్ర రత్నము కీర్తిశేషుడై 6 సంవత్సరములు గడచినవి. ఆనాడు వివేకవర్ధనీ నాటకళాలయందు లోకమాన్యుని స్మరణార్థము జరుపబడిన సభా వృత్తాంతములు వేరొకచో ముద్రితములై యున్నవి.

లోకమాన్యుడు 23 జూలై 1856 నాడు బొంబాయి ప్రాంతము నందలి రత్నగిరి యందు సాధారణ కుటుంబమున జన్మించెను. 1872 లో ప్రవేశ పరీక్ష యందును, 1876 లో పట్ట పరీక్ష యందును మహా గౌరవ ప్రదముగ నుత్తీర్ణుడయ్యెను. తానభ్యసించిన న్యాయశాస్త్ర జ్ఞానమును జీవనోపాధికై వినియోగింపక, బీదతనమునే శరణ్యముగ గొని, దేశ కార్యములందు ప్రవేశించెను. జీవిత కాలమున నీ మహానుభావుడు, ఉపాధ్యాయుడుగను, గ్రంథకర్తగను, పత్రికా లేఖకుడుగను, ప్రజా నాయకుడుగను, దేశసేవ సల్పి జరామరణము లేని కీర్తి గడించెను. తలపెట్టిన ప్రతి కార్యమునందును చలింపని పట్టుదల, మొక్కవోని ధైర్యము, స్వార్థ రాహిత్యతయు, యాథార్థవాదిత్వము ఆ యనఘుని యందు వ్యక్తములగుచుండెను. ఉపాధ్యాయుడుగా పనిచేసి శిష్యులందు విజ్ఞానముతో పాటు దేశాభిమానాగ్నిని రగుల్కొల్పి 'నవీన మహారాష్ట్ర దేశమ"ను దానిని సృష్టించెను. "వేదములందలి మన ఉత్తర ధృవ నివాసము" (Our Arctic Home in the Vedas)ను, “మృగ శిర” (Orion)ను రచించి స్వదేశీయుల వలన ప్రశంసనందుటే కాక యూరపు ఆమెరికా ఖండములందలి దిగ్ధంతులగు పరిశోధకులను తన నవీన సిద్ధాంతములచేత ఆశ్చర్య