మహారాజా బహద్దరు వారి ముల్కీ భాషా ప్రేమ
23 - 4 - 1936
మన రాష్ట్రములో హిందూ ముసల్మానుల ఐకమత్య స్థాపనము - మాటల చేతనేగాక కార్యముల చేతను - పెదవులచేతనే గాక హృదయము చేతను - కావించువారు ఎవరైన కలరా యనిన ఒక్కరు మాత్రము నిస్సంశయముగా కలరని పూని పలుకుచున్నాము. ఎవ్వరన మహారాజా సర్ కిషన్ ప్రసాదు బహద్దరు గారు గొప్ప దాత ఉదారుడు, పండితుడు, కవి, నానాభాషలందు ప్రవీణుడు విశాల హృదయుడు పూర్వపు మొగలాయి దర్బారు సిలుకు సముద్రము వంటి విశాల హృదయుడు నిష్పాక్షికుడు ఇట్టివారి అభిప్రాయములు చాల విలువ చేయునవి.
మొన్న ఉస్మానియా ట్రైనింగు కాలేజీ సాంవత్సరికోత్సవములో అధ్యక్షతా పీఠము నుండి వారు సెలవిచ్చిన మాటలలో ఈ క్రింది మాటలు ముల్కీలకు చాలా విలువ గలవి.
"గ్రామముల పాఠశాలలను పరీక్షించగా నాకు తెలియవచ్చిన, నేను తెలిసికొనిన విషయములను బట్టి యింత మాత్రము సూచన మాత్రము చేయుట చాలుననుకొందును అది యేమన - కొన్ని సంవత్సరములకు పూర్వము దేశభాషల విషయమై యుండిన నియమముల పరిపాలనలో విశేషముగా మార్పు కావింపబడుటచే విద్యా బోధకులకు (ముల్కీ) దేశ భాషలందు ప్రావీణ్యత తక్కువయి పోయినది దీని ఫలితముగా గ్రామ పాఠశాలలలోని విద్యార్థులకు కష్టము కలిగినది."
ఈ వాక్యములు అక్షర మక్షరము సత్యమని మేము చెప్పవలసిన పని లేదు నవ్వాబ్ మెహదీయార్ జంగు బహదరు గారే మహారాజాగారికి అదే సభలో జవాబు నిచ్చుచు నిట్లు సెలవిచ్చిరి