భావ కవిత్వము
25 - 7 - 1935
కొద్ది రోజుల క్రిందట కృష్ణదేవరాయల ఆంధ్ర భాషా నిలయంలో ఉస్మానియా విశ్వవిద్యా పీఠమువారు కళాశాలలో ఆంధ్ర సాహిత్యాధ్యాపకులగు శ్రీయుత రాయప్రోలు సుబ్బారావు గారి అధ్యక్షత్వమున జరిగిన సభాకార్యక్రమము సాహిత్యాభిమానులకు అధికముగ రుచించి యుండును కార్యక్రమ మందు ప్రధానాంశము "ఆధునిక కవిత్వము" అనుదానిని గూర్చి శ్రీయుత ఖండవల్లి లక్ష్మీరంజనము గారి యుపన్యాసమైనను, సంబంధవశమున ఆధునిక కవిత్వము, భావ కవిత్వము అని వ్యవహరింపబడు కవిత్వ పధమునకు ప్రతికూల పక్షమున చేరిన వానికిని వారి అభిప్రాయములను సభలో వెల్లడి చేయుటకు అవకాశమీయబడుటయు, అట్లు పైకి తేబడిన ఆక్షేపణలకు 'భావ కవులే' యగు శ్రీయుత సుబ్బారావు గారు సమాధానములు జెప్పుటకు అవకాశము కల్పింపబడుటయు సభలో రక్తి కట్టించుటకు కారణములు
లక్ష్మీరంజనముగారి యుపన్యాసమును దాని తర్వాత భావ కవిత్వమును ఆక్షేపించు డాక్టరు శర్మానంద గారి యుపన్యాసమును, రాయప్రోలు సుబ్బారావుగారి ప్రత్యుత్తరోపన్యాసమును క్రమముగా చేరి నేడు భావ కవిత్వోపాసకుల మనుకొనువారికిని ప్రాచీన కవిత్వోపాసకులమనుకొను వారికిని దృష్టి వైఖరులలో తీవ్రవైరమెందువలన కలుగుచున్నదో సుస్పష్టము జేసినవి మనలో ఆచారములు విషయమునందు వలెనే సాహిత్య సేవా విషయమునందును, ప్రాచీన మతము అని చెప్పదగు మతము నందు అభిమానము యింకను గట్టిగ నున్నది ప్రాచీనమైన ప్రతిదాని యందును గౌరవమును జూపుమన తత్వ మింకను యెక్కువ మారలేదు అందువలన భావకవిత్వమును ఉపాసించువారు కొందరు ప్రాచీన కవిత్వమునందు లోపముసు చూపి, ఆ లోపమును ఈ నూతన మార్గము ద్రొక్కు భావ కవిత్వము తీర్చుచున్నదనుసరికి ప్రాచీనాభిమానులకు కోపము కలుగును.