ఆయుర్వేదము - మనము
2 - 5 - 1935
మనము అనగా నిజాం రాష్ట్ర వాసులము ఆయుర్వేదమన నేమో యెరుగము. అనేకులు యూనాని పేరు విన్నారు కాని ఆయుర్వేదము పేరు కూడా వినినవారుకారు. కాని వైద్యము మాత్రము పల్లెలలో విశేషభాగము ఆయుర్వేద వైద్యమె. ఈ పల్లెలలోని వైద్యుల మూలమున మన ఆయుర్వేదము కొంతవరకపకీర్తి పొందియున్నది. కారణ మేమన మంచి వైద్యులు పల్లెలలో లేరు. ఏ బసవరాజీయమో, ఏ వస్తుగుణ దీపికనో, యే చికిత్సాసారమునో, ఏ అనుభవ వైద్యమునో నాలుగు పుస్తకములు చదివి, నాలుగు గోలీలు వద్ద నుంచుకొని వైద్యముచేయువారు చాలామంది గలరు ఇందుచేత తెలియనివారు ఆయుర్వేద వైద్యము మంచిది కాదనుచుందురు
వైద్యుల లోపము వైద్యలోపము కానేరదు మన రాష్ట్రములో యూనాని వైద్యులుగూడ చాలామందిగలరు వారును తిబ్బె అక్బరి, ఇలాజుల్గుర్భాలవంటి యొండు రెండు గ్రంధములు చూచికొని వృత్తిని సాగించుచున్నారు అట్టి హకీములను జూచి యూనాని వైద్యము చెడ్డదనవచ్చునా ?
అస్సలు విషయము ఆలోచించి చూచిన ఆయుర్వేదమునకును, యూనానీకిని, అవినాభావ సంబంధము కలదు ఆయుర్వేదము ముద్దు బిడ్డయే యూనాని అనచెల్లును ప్రాచీనములో అరబ్బులు ఫార్సీలు, తుర్కీలు హిందూవులవద్ద వైద్యమును నేర్చినట్లు నిదర్శనములు చాల కలవు కితాబుల్ ఫెమిరిస్తు గ్రంధకర్త హాజిఖలీఫా (క్రీ శ 10 వ శతాబ్దమువారు) వ్రాసినదేమనగా - ఖలీఫా హరూన్, ఖలీఫా మస్‌న్సూర్‌గార్ల ఆజ్ఞచే అనేక హిందూ వైద్య గ్రంధములు (Materia medica therapeutics) అరబీ భాషలోనికి తర్జుమా చేయబడెను.