గోలకొండకవుల సంచిక
9 - 7 - 1934
గోలకొండ కవుల సంచిక విషయమై భిన్నాభిప్రాయములప్పుడె బయలు దేరినవి. అది శుభసూచకమే! సంచిక పలువురి దృష్టి నాకర్షించినదని సంతోషించుచున్నాము ఒక్క విషయమున జనులలో నపోహలు కలుగునని మేమెరుగుదుము - అదే మన బ్రిటిషాంధ్రులు, నిజామాంధ్రులు అనుభేదము కల్పించుట - శ్రీయుత పి రమణయ్యగారు ఈ విషయమున తమ యభిప్రాయము ఇచ్చుచు ఇట్లు భేదభావమును చూపుట సంపాదకులకు పరిపాటికాదని సూచించుచున్నారు. బ్రిటీషు నిజామాంధ్రసమస్య సుమారు 7-8 సంవత్సరములనాటి ప్రతిధ్వనియే కాని క్రొత్తదిగాదు ఆనాడు రజతోత్సవ సంచికాసందర్భమున మమ్ము వృధా నిందలకు కొందఱు పాల్సేసిరి కాని యీ 8 సంవత్సరములనుండి మేము మా సర్వసమ బుద్ధిని ప్రతి విషయమునను వెల్లడి చేసితిమో లేదో పాఠకులే నిర్ణయింపగలరు మాకు భేదభావముల ప్రచారము చేయుటగాని బ్రిటిషాంధ్రులపై యసూయ కలిగించుటగాని నాడును నేడును ఆవంతయులేదని నొక్కి చెప్పుచున్నాము
అట్లైన నిదేమి, నిజాంరాష్ట్రకవులకు మాత్రమే సంచిక ప్రకటింపవలసిన యవసరమెందుకు? ఎవ్వరో యొకవ్యక్తి తెలిసియో తెలియకయో బుద్ధి పూర్వకముగానో లేక తలవనితలంపుగానో నిజాము రాష్ట్రములో కవులు పూజ్యమన్నంతనే మీకింతతొందర యెందులకు? ఇంత యభిమానమెందుకు? అనిషృచ్ఛ - ఈ యభిప్రాయమొకేవ్యక్తిదిగా నుండిన యది నిర్లక్ష్యముగా జూడవలసిందే కాని యట్టి యభిప్రాయము పలువురకుండునట్లు వినుచుంటిమి. వినుచున్నాము నిజామురాష్ట్రాంధ్రులు వలసబోయినవారనియే బ్రిటిషు ఇండియాలోని యాంధ్రులిదివరలో తీర్మానించుకొనలేదా మఱియు నదేమి గ్రహచారమో