సురవరం ప్రతాపరెడ్డి
159
యధిపతిని సింహాసనము నుండి తొలగింపరాదనియు, తొలగించుచోట్లలో బ్రిటిషు యిండియా నుండి ఎగుమతిచేసిన సివిలు సర్వీసు ఉద్యోగులనుగాక సంస్థాన ప్రజల ప్రతినిధులతో నేర్పడబడిన ఒక కమిటీని పరిపాలక స్థానమున నియమింప వలసినదనియు తీర్మానింపబడినది కాశ్మీరము, ఆల్వారు సంస్థానముల నిదర్శనమును మనసు నందుంచుకొనియే ఈ తీర్మానమును గావింపబడెను మహాసభకు అధ్యక్షతవహించిన యన్ సి కేల్కరుగారు చెప్పినట్లు సంస్థానములలో బ్రిటిషు మంత్రులను నియమించుటచే బ్రిటిషు యిండియాలో భారతీయులకు ఉద్యోగము లీయబడుచుండుట వలన పోయిన స్థానములు బ్రిటిషువారికి సంస్థానములలో భర్తియగుటయేగాక, ఫెడరేషన్ ఒకవేళ యేర్పడినచో అందులో సంస్థాన ప్రతినిధులమను పేరుతో ఈ విదేశీయులుచేరి ప్రజల కోరికలతో సంఘర్షణ యున్నప్పుడు బ్రిటీషు ప్రభుత్వమువారి కోరికలనే సాధించుటకు సాధన భూతులై యుండగలరు.
ఇట్లు మొత్తముమీద భారత సంస్థాన ప్రజామహాసభవారి తీర్మానములు సంస్థాన ప్రజలకు ఇటుజూచినను అటుజూచినను అనుమానమేయను స్థితిని తెల్పుచున్నవి సంస్థానములలో రాజులుండియు తమ ప్రజలను రంజింపజేయక వారి నిట్టిస్థితిలో బెట్టుట ఎంతమాత్రము గర్వింప దగినదిగాదు కొడుకు తండ్రిని అనుమానించి ఇతరుల సహాయమునాశించుట తండ్రికా లేక కొడుకునకా అపకీర్తికరము? రాజైనవాడు ప్రజల కందరికి తండ్రివంటివాడు అను అభిప్రాయము నిల్చునుగాని ప్రజలను ప్రాణములేని తన సొంత సొత్తువలె రాజుపయోగించుకొనుటకు హక్కుగలదు అను అభిప్రాయమును ఎవరును వివేకవంతులు మెచ్చజాలరు అట్టి అభిప్రాయమునకు తావుండిన చోట్లలో నెల్ల ఉపద్రవమే ఫలితమైనది కాబట్టి సంస్థానాధిపతులు తమ ప్రజల జ్ఞాన సామర్ధ్యములను బట్టి క్రమ క్రమముగా బాధ్యతాయుత ప్రభుత్వమును హెచ్చించుచు పూర్తి జేయుటకు శాసనములను జాగుచేయక ఏర్పరుపవలెను ఇంటిలో పెద్ద పెరిగిన కొడుకునకు ఇంటి పెత్తనమంతయు ఒప్పజెప్పినట్లే రాజ్యపద్ధతియు నుండవలెను. ఇంటి విషయములో వలెనే రాజ్య విషయమును పరస్పరానురాగ నిబద్ధమై యుండవలెను. అనగా తమ ప్రజలకు ఏమి బాధలున్నను సంస్థానముల ప్రభుత్వమువారు సంతోషముతో తీర్చుచు వారికి మనఃక్లేశము గలుగనీయకుండ పాలింపవలెను. అట్టి రాజ్యములను ప్రజలెన్నటికిని విడువగోరరు ఈ బుద్ధిని భగవంతుడు కలిగించుగాక!