సంస్థాన ప్రజల ఘోష
26 - 7 - 1933
భారత సంస్థాన ప్రజల స్థితిని జూడ దిక్కులేనట్లున్నది. వారు తమ రాష్ట్రములో తమ కోరికలను తెలుపుకొనజాలకుండుటచే రాష్ట్రాంతరమునకు పోయి అచటనుండి తెలుపవలసి వచ్చుట సంతాపకరము వారి కోరికలు అందరిచేతను దూషింపబడునంత నింద్యములైనచో వాటిని గూర్చి ఏ వాదము అక్కరలేదు. తమ పాలనకు తామే బాధ్యులమై యుండవలెనను ప్రజల కోరిక యింతవరకును అర్ధశాస్త్రవేత్తలచే దూషింపబడలేదు అంతేగాక ఈ కాలమున నేటికిని "ఏ రాజ్యమందుగాని ప్రభుత్వము ప్రజలదే" యనుభావము ప్రతి నాగరిక రాజ్యమందును అంగీకృతమై యున్నది ప్రజాస్వామిక పాలన కాలము అంతరింపలేదనియే మా నమ్మకము. కొందరు ఇటలీ, జర్మనీ మొదలగు ప్రాశ్చాత్య దేశములందు నియంతృత్వపాలన (Dictatorship) యున్నది గనుక ప్రజాస్వామిక ప్రభుత్వములంతరించినవని వాదింతురు. అచటనైనను ప్రజలు సమ్మతించినందువల్లనే వారు నియంతలకు అవసరమగు స్థితి యేర్పడినది గనుకనే ప్రజలు సమ్మతించిరి అమెరికాలో రూజ్వెల్టుగారి అధికారము ఈమధ్య ప్రబలమైనదియు నీ కారణముచేతనే కావున ప్రజాసామిత్వమునకు భంగము రాలేదు. ఇట్లు ప్రపంచమందు చుట్టుప్రక్కల రాజ్యములలో ప్రజలు స్వాతంత్ర్యమును రుచి చూచుచుండ భారత సంస్థాన ప్రజలు దానిచే ఆకర్షింప బడకుండజాలరు. రుచిచూతమన్న వారికి తమ రాజ్యములో అధి లభింపదాయెను. మాకది కావలెనని తమ ప్రభువుగారికి తెలియునట్లు చెప్పుకొనకూడదాయెను. చెప్పుకొన్న చోటనైనను వారు మనష్యులవలె వారి కోరికలు కోరికలవలె ఆదరింపబడవాయె. ఇంక వారేమి చేయగలరు" తమ కోరికలు సాధించుకొనుటకై యితర రాష్ట్రముల యొక్క శరణుజొచ్చుచున్నారు
బొంబాయిలో ఈ జూలై నెల 22-23వ తేదులతో జరిగిన సంస్థాన ప్రజా మహాసభ యొక్క చతుర్థ సమావేశమునందు ఆమోదింపబడిన తీర్మాన