Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

152

గోలకొండ పత్రిక సంపాదకీయాలు

వారు ఆ వాగ్దానమును నెరవేర్చబోవు సరికి అడ్డుతగిలిరి ఈ ప్రతికూలుర కందరికి ఈ రెండవ ఉపవాసము ఆత్మపరీక్షకు తగిన సమయము. వారు ప్రాచీనమైన పద్ధతియనెడు ఒక్క హేతువుచేత మాత్రమే ఏ ఆచారమునైనను గౌరవించుటకు సిద్దులుగ నుండకూడదు తత్వమును మనస్సులో ఏ పక్షపాతములేక విచారించి తదనుసారముగా వర్తించవలెను. హరిజనోద్ధరణోద్యమమునకు అనుకూలురుగ నున్నవారు మాంద్యమును మాని చురుకుగా పని చేయవలెను.

ఇట్లంతయు తప్పక జరుగుననియే మా నమ్మకము మహాత్ముని మనోబలము అప్రతిహతమైనది. మహాత్ముడు తలపెట్టినంత దానిలో ముప్పాతికవంతైనను ఈ 21 రోజుల ఉపవాసదీక్షలోగా నేరవేరవలెను. లేనిచో మరియొక సారి మహాత్ముడు ఇటువంటి ఉపవాసమును పూనవలసి వచ్చును. ఆ మాటను యిప్పటి నుండియే మహాత్ముడు సూచించుచున్నాడు ప్రస్తుతోపవాసము యిక మీద రాబోవు అటువంటి యుపవాసములలో మొదటిది యని మహాత్ముడు చెప్పుటలో అదే అభిప్రాయమని మాతలంపు ప్రస్తుతోపవాసమునే అంత్యోపవాసమునుగ గూడ చేయగల శక్తి భారతీయుల చేతిలో నున్నది వారు మాంద్యమును ప్రాతికూల్యమును వదలి మహాత్మునికి ప్రియులగు హరిజనుల నుద్ధరించుట యందు శ్రద్ధాభక్తులతో పని చేయుదురేని మహాత్మునికి అటువంటి మరియొక ఉపవాసముతో పనియుండదు

ఈ సమయమున మహాత్ముని విడుదలయు భారతీయులందరికిని సంతోషము కలిగింపక మానదు వారు ప్రభుత్వమున కిందులకై కృతజ్ఞులు, కానీ ఇది దుఃఖములో సంతోషము భగవంతుని నమ్మి మహాత్ముని యాత్మోత్సాహమునకై భారత ప్రజలు ద్విగుణీకృత శ్రద్ధతో అస్పృశ్యతా నిర్మూలనోద్యమమున పనిచేయుటకన్న యిప్పుడు వేరు మార్గమేదియు కన్నడదు. అది యే మహాత్ముడును సూచించిన మార్గము.