Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సురవరం ప్రతాపరెడ్డి

145

నప్పుడు మన ఉర్దూ యూనివర్సిటీ యితర భాషల వారికిని అనగా అందరికిని ప్రీతి పాత్రముగా నుపయోగ కారిగా నుండవలెనని సెలవిచ్చియుండిరి కాని వారి మాట యరణ్యరోదనమై పోయెను

ఇక మన రాష్ట్రీయ సోదరుల దృక్ఫధమెట్టిదో కనుగొందము హాష్మీగారు ఇటీవల బుల్లెటిను పత్రకలో ప్రఖ్యాతికి వచ్చిన తమ ఉర్దూ హిందూ దేశ చరిత్రలో ఆంధ్ర వాఙ్మయము కన్నడ, అరవ వాఙ్మయ మంతటి ప్రాచీనముది కాదని యింకయు నేమేమో వ్రాసిరి వారి కస్సలు తెనుగు ఓనమాలైనవచ్చునో లేదో కాని వాఙ్మయము విషయములో గొప్ప యభిప్రాయమిచ్చిరి. ఇచ్చినను తప్పులేదు. వారి పుణ్యము వారాంధ్రమును త్రొక్కండి ధ్వంసించండి అనక పోయిరి.

మా సోదరులు రహబరు పత్రిక సంపాదకులు 4-5 ఏండ్ల క్రిందట ఉర్దూ తప్ప తక్కిన భాషలను పాతములో (ఆఖ్బిజమీన్) నికి త్రొక్కి నుసిజేసి తూరుపెత్తి బూడిదచేసి గంగలో కలిపిరండని ముద్దు ముద్దుగా హితబోధచేసి యుండినది మా యాంధ్ర సోదరులు - అభిమాన లేశమైన యుండిన కదా - మరచిపోయినట్లున్నది ఇట్టి ప్రేమకల వాతావరణములో నిజాం రాష్ట్రాంధ్రులు మృతప్రాయులగుచుండ పూజ్యులైన సర్ చంద్రశేఖరుగారు అమృతసేచనము చేసి జీవము నిచ్చిరి

ఇచ్చటి యాంధ్రులు జీవచ్ఛవంబులై కళదక్కి దినదినము క్షీణించి బోయీలై మూటలు మోయుటలో ఆదిహిందువులై ఆయాలు, గౌండాలగుటలో పాచకులై గరిటెత్రిప్పుటలో గుమస్తాలై కలము సాము చేయుటలో యపూర్వ పాండిత్య ప్రకర్షను జాటుచున్నారు దీనికి కారణము వారే కాని యితరులు కారు వారికి తమ భాష రోత ఇంత ఉర్దూ డొక్క శుద్ధియైన రెడ్డి దేశముఖులు, వెలమదొరలు గోలకొండ వ్యాపారీ దేశ పాండ్యాలు తమలోతాము కలసినప్పుడు ఆంధ్రమందు మాట్లాడుటకు సిగ్గు-ముగ్ధకున్నంతటి సిగ్గు-ఉర్దూలో మాట్లాడుటలో “సరదా” చూపించెదరు. ఇక ఆంధ్రభాష "కాటిక కంటి నీరు చనుకట్టు పయింబద నేల యేడ్వదో" యోజింపుడు