136
గోలకొండ పత్రిక సంపాదకీయాలు
పాఠశాలలు సమానముగా నుండవలె ననెను. "మాతృ భాషయందు విద్య"యను నభిప్రాయము యిపుడు బలమైయున్నను, భారతీయులందరికినీ సమానముగా సులభమైన హిందీ భాష దేశభాషయైననేగాని మన దేశమందు జాతీయ భావము వృద్ధికి రాదు. అని మేము తలచెదము, జాతీయ భావమనునది యెఱుగక అంతర్జాతీయత యని ఘోషించుట మొదటి మెట్టునుండి కడపటి మెట్టుపై అడుగు పెట్టి నటులుండును. విద్యను భేదములను సమసిపోవునటుల నేర్పుటకు తగిన సౌకర్యములు విద్యా ప్రవీణులు చేయవలయును. అట్లేర్పరచబడిన విద్యా విధానము దేశమందంతయు అనుసరింపబడవలయును.
హైదరాబాదు మహిళా సభవారు కట్టకడపట "పట్టణమందు వ్యాధులచే బాధపడుచుండు వారి స్వార్థ త్యాగులై సాంఘికసేవ చేయవలయును" అని గావించిన తీర్మానము సభకు చక్కని ముగింపుగా నున్నది. భావి రాజ్యాభివృద్ధి విషయమున తండ్రులకంటె తల్లులయందే యెక్కువ బాధ్యత కలదు. కావున, హైదరాబాదు మహిళా సభవారు తమ యుదారాశయములను త్వరలో సత్యము గావించుకొనగలరని యాశించుచున్నాము.