Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

X

తెలుసుకునే వారు. ప్రతాపరెడ్డిగారి సంపాదకీయాలలో వ్యంగ్యం, అధిక్షేపం, తీవ్రత, అభినివేశం అనే గుణాలు కొట్టవచ్చినట్లు కనిపించేవి. విషయానికి అనుగుణంగా వారు శైలిని మార్చి వ్రాసేవారు. స్వేచ్ఛగా వ్రాసేవారు. అప్పుడప్పుడు ప్రతాపరెడ్డిగారు స్వగ్రామమైన ఇటికాల పాడుకు (అప్పుడది నీళ్లు లేని ఇటికేల పాడు) వెళ్ళి వచ్చేవారు. వారు లేనప్పుడు సంపాదకీయాలు వ్రాసే బాధ్యత స్నేహితుల కెవరికైనా అప్పగిస్తూండే వారు. ఆ సంపాదకీయాలు చదివితే ప్రతాపరెడ్డిగారు హైదరాబాదులో లేరన్న విషయం సులభంగా అర్థమయ్యేది. సంపాదకీయాన్ని చదివి మీరు తిరిగి హైదరాబాదు వచ్చారని తెలిసిందని ఉత్తరాలు వ్రాసిన మిత్రులు వారికి లేకపోలేదు. సంపాదకీయాలను చదివితే ఆయన ఉనికి స్పష్టంగా తెలిసిపోయేది.

ఆనాడు దేశానికి మార్గదర్శకులైనవారు పత్రికలనే అందుకు సాధనంగా వినియోగించుకున్నారు. అన్నిటికన్న మిన్నగా మహాత్మాగాంధిగారు యంగ్ ఇండియా, మరియు హరిజన్ పత్రికలను, బాలగంగాధర తిలక్ గారు మరాటా, కేసరిద్వారా, జవహర్‌లాల్ నెహ్రూగారు నేషనల్ హెరాల్డు పత్రికద్వారా, మౌలానా అబుల్ కలాం ఆజాద్‌గారు అల్ హిలాల్ పత్రిక ద్వారా, రాజగోపాల చారిగారు స్వరాజ్య పత్రికద్వారా తమ అభిప్రాయాలను ప్రజలకు అందజేసినారు. ప్రతాపరెడ్డిగారు ఈ మహనీయుల మార్గమునే అవలంబించిరి. బి. ఏ., బి. యల్ పట్టభద్రులైన ప్రతాపరెడ్డిగారు వృత్తినే అవలంబిస్తే న్యాయమూర్తులయ్యేవారు. ఉద్యోగమే చేస్తే పెద్ద పదవి దొరికేది. వ్యవసాయం చేసుకున్నా తగినంత సంపాదన లభించేది. పుష్కలమైన సంపాదన కొరకు అవసరమైన అవకాశాలన్నీ కలిగినప్పటికి ప్రతాపరెడ్డిగారు వాటిని వినియోగించు కొనక పత్రికా నిర్వహణకు తమ జీవితమును అంకితము చేసినారు. ఇది ఆయన త్యాగ నిరతికి నిదర్శనం. గోలకొండ పత్రికతో ఆకస్మికముగా సంబంధం వదలుకొన్నప్పుడు మరొక పత్రిక స్థాపించే దాక ప్రతాపరెడ్డిగారు నిదురపోలేదు. ప్రజావాణి పత్రికను కొంతకాలము వారు నడిపినారు. ప్రజావాణి