మన రాష్ట్రమందలి కాగిత పరిశ్రమ
27 - 4 - 1932
ఇంతవరకును మనరాష్ట్రములో కాగితముల పరిశ్రమలు పూర్తిగా లేవని భావింప జనదు. మనరాష్ట్రములో నేటికిని రెండుమూడు తావులందు కాగితములు తయారు చేయబడుచున్నవి. ఔరంగాబాదు నగరమునకు 10 మైళ్ళ దూరములో ఎల్లోరా గుహల సమీపమందు ఒక గ్రామము "కాగజ్‌పూర్ " అని అన్నది. దాని పేరును బట్టయే దాని సంగతి తెలియును. కాగజ్ అనుఫార్సీ పదము నుండియే మన తెలుగులో కాగితము లేక కాగిదము అని యేర్పడినవి సంస్కృతమందు పత్రము అని యందురు. పత్రమనగా ఆరు. ప్రాచీన కాలము నుండి మొన్న మొన్నటివరకు మన పూర్వులు దక్షిణమున తాటి యాకులపైనను, ఉత్తరమున భూర్జపత్రములపైనను వ్రాయుచుండిరి. అందుచేతనే పూర్వవాసనా విశేషముచేత నేటికిని కాగిదములను సంస్కృతములో పత్రములని యందురు
కాని కాలము మారినది పాశ్చాత్య దేశములో అచ్చు పనులు వృద్ధియైన కొలదియు, గ్రంథములసంఖ్య హెచ్చైనకొలదియు, కాగిదముల యవసరము విశేషమయ్యెను. అందుచేత పాశ్చాత్య దేశములలో కాగిదముల యంత్రాలయములు వేలకొలది గలవు
మన హిందూస్థానములో బెంగాలులోను మద్రాసు రాజధానిలోను మొత్తముపై మూడే కాగితముల యంత్రాలయము లుండినట్లు కనబడుచున్నది. అందుచేత మన దేశములో నీ పరిశ్రమ యొక్క యవసరము చాలగలదు. ఈ యంశమును దృష్టి యందుంచుకొనియే మన రాష్ట్ర ప్రభుత్వము వారు మన రాష్ట్రములో నీ పరిశ్రమను స్థాపించవచ్చునా లేదా స్థాపించిన లాభముండునా లేదా యను విషయములను నిర్ణయించుటకై కొందరి శాస్త్రజ్ఞులను నియమించిరి వారు తమ పరిశోధనా ఫలితముగా నొక నివేదికను సిద్ధము జేసిరి అట్టి