దరిద్రనారాయణుడు
3 - 10 - 1931
దరిద్రనారాయణుడగు గాంధీమహాత్ముడు భారతదేశమున యవతరించి నిన్నటికి 62 సంవత్సరములు గడిచెను. ఈ మహాత్ముని దివ్యనామముతెలియని వ్యక్తి లేడనిన అతిశయోక్తి కానేరదు. గాంధీ మహాత్ముడు కోట్లకొలది బీదలకు సేవ జేయుటకును, వారిని యుద్ధరించుటకును యవతరించెను. తన యుద్దేశమును నెరవేర్చుటకై నేటికిని అహోరాత్రులు కృషి సలుపుచున్నాడు. మహాత్మునికి ప్రేమ, సత్యము, అహింస యను మూడు గుణములు మూలాధారములు అహింసయే విజయాస్త్రము ప్రేమవలననే శత్రువులను కూడ లోబరుచుకొన గలుగుచున్నాడు. భారతదేశములోని కోట్లకొలది బీదల దుస్థితి గాంచి సహించ లేక తాను గూడ ఐచ్చిక దారిద్ర్యమును స్వీకరించెను. వారిని యుద్ధరించుటకై రాట్న పరిశ్రమ లేవనెత్తెను రాట్నమే బీదలకు భుక్తి నొసగునని ప్రపంచమునకు చాటెను ఇది యొక పిచ్చి యని పలువురు పరిహసించసాగిరి నేడయ్యదియే సుదర్శనచక్రముగా మారినది విదేశ వస్త్రములను భారతదేశమున దిగుమతి కాకుండ జేయుచున్నది నిరుద్యోగులకు పని గల్పించినది. భారతీయులకు స్వదేశీపై ప్రేమ గలిగించినది. మహాత్ముడి రాట్నమును ప్రజల హర్నిశములు ద్రిప్పవలయునని కోరుచున్నాడు ఖద్దరే సర్వదా ధరించవలెనని హెచ్చరించుచున్నాడు ఖద్దరువలన భారతీయులలో కలిగిన నూతనోత్తేజము గత సత్యాగ్రహ సమరమున ప్రపంచమునకై విదితమైనది బ్రిటిషు ప్రభుత్వము వారిని భయకంపితుల గావించినది. నిర్బంధప్రయోగములన్నియు వ్యర్థమైనవి సత్యము, అహింసపై ఆధారపడినచో జయము తప్పక చేకూరునను విశ్వాసము ప్రజలలో యుద్భవించినది వేయేల ఖద్దరువలన భారతదేశమున నూతనశకము ప్రారంభమయ్యెను. ఈ శకమునకు మూలపురుషుడు గాంధీ మహాత్ముడు. ఈయన బోధించుచున్నది ఖద్దరు మంత్రము. ఈ మూడక్షరములు జపించిన