Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

108

గోలకొండ పత్రిక సంపాదకీయాలు

మైనట్లు సిమ్లాలో జరిగిన సమావేశమువలన విదితమగుచున్నది. భారతదేశమునందు హిందూ మహమ్మదీ యొక్యతను కాక్షించు మహానుభావులందరును, మహమ్మదీయులలో నధిక సంఖ్యాకులును, ముఖ్యముగా జాతీయ వాదులందరును, సంయుక్త నియోజకవర్గములనే వాంచించుచున్నారు. కొన్ని దినముల క్రిందట నిచటికి విచ్చేసి సుమారారు వారము లిచట నివసించినట్టియు, లాహోరులోని జమీందారు పత్రికా సంపాదకులైనట్టియు మౌలానా జఫరలీఖాన్ సా॥ గూడ సంయుక్త నియోజక వర్గములే కోరుచు ప్రస్తుత స్థితిగతులనుబట్టి పది సంవత్సరముల వరకు ప్రత్యేక నియోజకవర్గము లుండవలయుననియు, తదుపరి సంయుక్త నియోజక వర్గములు కావలయుననియు, యభిప్రాయ మొసగిరి. దీనికి జాతీయ పక్షము వారొప్పుకొనినను షాకతలీ పక్షమువారు ఇందు మరికొన్ని కఠినతమములగు నిబంధన లేర్పరచిరి ఇక ముందైనను వీరు సమాధానమునకు వత్తురో లేదో చూడవలసి యున్నది. ప్రకాశంపంతులుగారు హిందూదేశ అంతస్సమస్యయగు నిది పరిష్కారముగాకున్నను రౌండుటేబిలు మహాసభ యందు పాల్గొనవలయునని యభిప్రాయమును వెల్లడించిరి. గాంధీ మహాత్ముడును, కాంగ్రెసు కార్యనిర్వాహక సభ్యులును, దీనినే యంగీకరించినారు కదా! ప్రకాశంగారు సంస్థాన ప్రజల యధికారమును గూర్చి వివరముగ చర్చింపకున్నను పటియాలా మహారాజుగారు సమాఖ్య విధానమునకు సమ్మతింపక నూతన విధానమును సూచించుట గూర్చి తీవ్రముగా ఖండించి యితర సంస్థానాధీశులు వీరి యభిప్రాయమునకు సమ్మతిని తెలుపనందున సంతసించిరి సంస్థానాధీశులు బ్రిటీషిండియాతో బాటు సమాఖ్యలో చేరవలయునని వీరు సలహా నొసగిరి

మొత్తముపై వీరు భారత దేశాభివృద్ధికరములగు నట్టియు, భావ్యభివృద్ధికి ఆటంకములగు నట్టియు, విషయములన్నిటిని చర్చించిరి. వీరు ముఖ్యముగా కోరినట్టి విషయమగు ప్రత్యేకాంధ్ర రాష్ట్రమును గూర్చి ముందు జరుగబోవు రౌండు టేబిలు సభలో విచారణకు వచ్చుననియు, గాంధీమహాత్ముడు ఈ విషయమును గురించి శ్రద్ధ వహించుటకు సమ్మతించుటచే నిది సఫలమగుననియు, విశ్వాసము కలుగుచున్నది దీని కొరకు ఆంధ్రులు తమ యావచ్ఛక్తిని వినియోగించెదరు గాక అంతః కలహముల చెలరేపి ఈ మహదాశయమునకు విఘ్నము కలిగింపకుందురు గాక!