ప్రతాపరుద్ర జన్మదినోత్సవము
28 - 3 - 1931
శా. శ 1176 అను ఆనందనామ సంవత్సర చైత్ర శు॥ 5 ల రోజున (25-3-1254) కాకతీయ సామ్రాజ్యము నేలిన ప్రతిభాశాలియగు ప్రతాపరుద్ర సార్వభౌముడు జన్మించిన దినమని స్థానిక చరిత్ర చరిత్రవలనను ప్రతాపరుద్ర చరిత్రవలనను తెలియుచున్నది. ఇట్టి మహా పురుషుని జన్మదినోత్సవము జరిపి ఆ మహనీయుని యశోగానము గావించుట ఆంధ్రుల శ్రేయోభివృద్ధి కవసరమని గత బుధవారమునా డొక బహిరంగ సభ రెడ్డి గ్రంధాలయ భవనమునందు ఆంధ్ర యువకులు సమావేశ పరచిరి. ఇట్టి కార్యము చేత ఆంధ్ర యువకులు ఇతరులకు మార్గదర్శకులగుటయే గాక ఆంధ్రుల జీవితములను ధన్యము గావించిరి.
ఈ సభకు ముఖ్యోపన్యాసకులుగ నుండిన మారేమండ రామారావు పంతులు ఎం ఏ గారే యీ యుత్సవమునకు కారకులని చెప్పవచ్చును. ఏలయన ఆంధ్ర యువకు లీ వీరుని యుత్సవము సలుపవలయునని చాలకాలము నుండి తలంచు చున్నను, ఏ తేదీన జరుపవలయునో సందేహించు చుండిరి. కాని శ్రీ రామారావు గారు చైత్ర శు॥ 5 రోజున ప్రతాపరుద్రుని జన్మదిన మని నిర్దారణ పరచి ఆ మహానీయుని యశోగానము గావించుటకు ఆంధ్రులకు మార్గము చూపిరి.
జాతీయోన్నతికి వీరపూజ ముఖ్యాతి ముఖ్యము. వీరుల స్మరణయే జాతిని తేజోవంతముగను, శక్తిమంతముగను, నొనర్చును. దేశాభిమానమునకును, జాతీయాభిమానమునకును, వీరపూజయే మూలకందము. కనుక ఇట్టి సభలు ప్రతి వత్సరము జరుగుచుండ వలయును ఇపుడు జరిగిన యుత్సవమునకు తగినంత వ్యవధి లేకుండుట చేతను, కొన్ని అనివార్య కారణములు సంభవించుట చేతను, వైభవముగ జరుపుటకు వీలులేక పోయెను. అయినను