vii
వారు. ఉర్దూలో రయ్యత్ పత్రిక సంపాదకులైన మందుముల నరసింగరావుగారు, పయాం పత్రిక సంపాదకులైన ఖాజీ అబ్దుల్ గఫార్ (మౌలానా అబుల్ కలాం ఆజాద్‌గారిచేత ప్రభావితుడు,) ఆర్యభాను పత్రికా సంపాదకులైన వినాయకరావు విద్యాలంకార్‌గారు ప్రత్యేకంగా పేర్కొనదగినవారు. ఆ రోజుల్లో మాడపాటి హనుమంతరావుగారు ముషీరె దక్కన్ పత్రికకు సంపాదకీయాలు రాస్తుండేవారు. ఈ పత్రికా సంపాదకులందరు ప్రజల ఉద్యమాలతో సంబంధం కలిగి ప్రజల సమస్యలపట్ల సానుభూతి కలిగినవారు . ఒకవేళ ఆ రోజుల్లోనే ప్రజలు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వం ఏర్పడితే వీరిలో ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి కాదగినవారే. వారి వ్యక్తిత్వాలలో అతివాద, మితవాద ధోరణులేమైనప్పటికి అందరూ ప్రజల మనుష్యులే అని చెప్పవలసి ఉంటుంది. పత్రికా నిర్వహణలోను సంపాదకీయాల తీరుతెన్నులలోను వారి వ్యక్తిత్వాల ప్రభావంవలన కొన్ని వ్యత్యాసాలు ఉండియుండ వచ్చును.
1926 లో ప్రారంభమైన గోలకొండ పత్రికకు ప్రతాపరెడ్డిగారు మొదటి రెండు మూడు సంవత్సరాలు ప్రచ్ఛన్నంగాను, తరువాత ప్రత్యక్షంగాను సంపాదకులుగా ఉండి పత్రికను నిర్వహించినారు. గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రతాపరెడ్డిగారు, నరసింగరావుగారు, హనుమంతరావుగారివలెనే న్యాయవాద వృత్తితోనే జీవితం ప్రారంభించినారు. హనుమంతరావుగారు షష్ఠిపూర్తి వరకు న్యాయవాద వృత్తిని వదలిపెట్టలేదు. కాని ప్రతాపరెడ్డిగారు, నరసింగరావుగారు, కొన్ని సంవత్సరాలలోనే న్యాయవాద వృత్తిని వదలుకొని పూర్తిగా పత్రికలకే అంకితమయినారు. ఆ రోజుల్లో హైదరాబాదు రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణాలో ప్రజల శ్రేయస్సుకు సంబంధించిన ఏ ఉద్యమాలు వచ్చినప్పటికి వీటన్నిటితోను ప్రతాపరెడ్డిగారు సంబంధం కలిగినవారు. మొట్టమొదటి ఆంధ్ర మహాసభకు ప్రతాపరెడ్డిగారే అధ్యక్షులు. ఆ రోజుల్లో సంఘ సంస్కరణ సభలకు అనేకమైన వాటికి అధ్యక్షత వహించినారు. ఆ రోజుల్లో ప్రజలకు మేలుకగిలించే ఏ ఉద్యమం వచ్చినా ప్రతాపరెడ్డిగారి సహాయం దానికి లభించేది.