Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96

గోలకొండ పత్రిక సంపాదకీయాలు

అందువలననే మరణసంఖ్య అధికముగ నున్నది ఎల్లప్పుడు ఏదో యొక వ్యాధి ప్రబలుచుండును ఈ విషయమున ప్రభుత్వమువారికన్న ప్రజలే తగుకట్టుబాట్లు చేసికొనవలసియున్నది గ్రామములో విద్యావంతులు తమ తోడి సోదరుల క్షేమ లాభములను దృష్టియందుంచుకొని వారికి ఆరోగ్య విషయమునను, యితర విషయములందును బోధ గావించిన కొలది దినములలో గ్రామముల స్థితిగతులు కొంతవరకైనను బాగుపడుననుటలో సందియముండదు.

మాడపాటి హనుమంతరావు పంతులుగారు నుడివినటుల తెలంగాణములోనే కల్లుదుకాణము లధికముగ గలవు. మత్తు పదార్థముల గ్రోలుటకు ప్రభుత్వమువారి పద్ధతియే ప్రోత్సహించు చున్నదని దేశాభిమాను లనుకొనుచున్నారు. ఆబ్కారీ ఆదాయము ప్రతి సంవత్సరము పెరుగుచుండుటయే దీనికి నిదర్శనము. మత్తుపదార్ధముల ధరలు హెచ్చిన వానిని యుపయోగించు వారి సంఖ్య తగ్గుచుండుట లేదు. కనుక ప్రభుత్వమువారు త్వరలో త్రాగుడు పద్ధతి నిర్మూలించుటకు నూతన పద్ధతి ప్రవేశ పెట్ట వలయును

ఇచట దేశపురోవృద్దికై పాటుబడువారే అరుదు ఉన్న వారై నను ప్రచారము చేయదలచినను బహిరంగ సభల గష్తివలన ఆటంకము కలుగుచున్నది. ప్రభుత్వమువారు బహిరంగ సభలకై అనుమతి నొసంగుచున్నను సభా సమావేశకులకు అనుమతి పొందుటకు కొంత కాలము ప్రయత్నింప వలసివచ్చుచున్నది. దీనిచే సమయము మించిపోయి చేయదలచుకొనిన సభవలన అంతగా లాభము కలుగుచుండుట లేదు. దేశము నందావరించి యున్న అంధకారమును తొలగించుటకు ప్రస్తుతము ఉపన్యాసములే అవసరమై యున్నవి ప్రజలలో ప్రబోధము కలిగిన వారపుడు కార్యాచరణకై గడంగుదురు కనుక దేశాభివృద్ధి కలుగవలయునన్న ఈ బహిరంగ సభల గూర్చిన గష్తీని ప్రభుత్వమువారు వెంటనే రద్దుచేయవలయును ప్రభుత్వమువారు రాజకీయ సభలకై అనుమతి పొందవలయునను నిర్బంధముంచినను ఉంచవచ్చును, కాని విద్యా, సాంఘిక విషయిక సభలకై ఎట్టి నిర్బంధముల నుంచరాదని మేము కొరుచున్నాము.