Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మన స్థితిగతులు

6 - 12 - 1930

స్వదేశీలీగుపక్షమున నిన్న దేవీదీస్‌బాగులో జరిగిన బహిరంగసభ చాల ముఖ్యమైనదని చెప్పవచ్చును ఈ సభ కధ్యక్షత వహించిన పండిత కేశవరావుగారు కరోద్గిరి మహిసూలు వలన ప్రజలకు నష్టము కలుగుచున్నదని అంకెల ద్వారా తెలిపిరి. ఈ కరోద్గిరి మహిసూలు (సుంకపు పన్ను కొన్ని వస్తువులపై మూడు నాలుగుసార్లు తీసికొనబడును ) ఈ దేశమునందు తయారగు వస్తువులే నగరమునకు గొనితెచ్చినవానిపై పన్ను విధించుట చోద్యముగ నున్నది. ఈ విషయ మొక యుదాహరణము వలన బాగుగ తెలియగలదు ఒక నేతగాడు షోలాపూరము నుండి నూలు తెప్పించిన మొదలు ఈ నూలు ఈ రాష్ట్రమునకు దిగుమతి చేయబడినందున దానిపై సుంకము వసూలుచేయబడును ఆ నేతగాడు ఈ నూలుతోనే నేసిన వస్త్రములను విక్రయమునకు దెచ్చిన మరల సుంకము వసూలు చేయబడును ఆ వస్త్రములనే ఒకడు కొని వేరొకచోటికి తీసికొని పోయిన అవి క్రొత్త వస్త్రములని సుంకము విధింపబడును ఈ ప్రకారము సుంకము అందగట్టుటచే ఇచటి పరిశ్రమలకు తీరని నష్టము కలుగుచున్నది. మేమిదివరకెన్నియోసారులు సూచించినట్టు దయామయులగు ప్రభుత్వమువారు దేశీయ పరిశ్రమ అభివృద్ధి జెందవలయునని కోరుదురేని ఈ కరోడ్గిరి మహిసూనులును వెంటనే తొలగించవలయును.

రామచంద్రనాయకు బారెట్లగారు హైద్రాబాదు ప్రస్తుత ఆర్థికస్థితిని దెలిపి విద్యాధికులను గ్రామముల స్థితి బాగుపరుచుటకు పూనుకొనుటకై ప్రబోధించిరి ఫజలుల్రహామాన్ సా॥ తెలిపినట్లు ప్లేగు, కలరా మున్నగు అంటువ్యాధుల వలన జనసంఖ్య తగ్గుచున్నది ప్రజలకు వైద్య సహాయము లభించుటలేదు. ప్రజలు విద్య నేర్చినవారు కానందున ప్రభుత్వమువారు చేయునున్న సహాయము నుండి యైనను లాభము పొందుటలేదు. గ్రామముల పారిశుధ్యము కూడా బాగులేదు.