తొలిపలుకు
భారతదేశంలో పత్రికల చరిత్ర చాలా ఉజ్జ్వలమైందని చెప్పవచ్చు. భారతదేశ స్వాతంత్ర్య సాధనకు, భారత జాతీయతకు, భారతదేశ సమైక్యతకు ఈ పత్రికలు చాలా తోడ్పడినవి. దేశ భాషా పత్రికలే కాక ఇంగ్లీషు పత్రికలు కూడా ఈ మూడు ఆశయాల సాధనకు గణనీయమైన కృషి కావించినవి. భారత ప్రజాస్వామికానికి కూడా పత్రికలు ఇప్పటి వరకు చేసిన, ఈనాడు చేస్తున్న కృషి చాలా గొప్పదని చెప్పవచ్చు. ఒక చిత్రమేమంటే ఇంగ్లీషు వారిని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టి స్వరాజ్యసాధనకు కృషిచేసిన కొన్ని ముఖ్యమైన పత్రికలు ఇంగ్లీషులోనే నడిచినవి. చాలా మంది ఆంధ్రులు ఈ ఇంగ్లీషు పత్రికల నిర్వహణకు తోడ్పడినారు. వీరిలో సి. వై. చింతామణి, కోటంరాజు సోదరులు, యం. చలపతిరావు, కాసా సుబ్బారావు మొదలయినవారు ప్రత్యేకంగా పేర్కొనదగినవారు. తెలుగుపత్రికా సంపాదకులలో కాశీనాథుని నాగేశ్వరరావు, ముట్నూరి కృష్ణారావుగారు ఈ తరగతికి చెందినవారు.
ప్రతాపరెడ్డిగారు 1926 లో గోలకొండ పత్రికను ద్వైవార పత్రికగా స్థాపించినారు. అప్పుడు హైదరాబాదు రాష్ట్రంలో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలు ఉండేవి. ఇందులో తెలంగాణా ప్రజలు అధిక సంఖ్యాకులు, తెలుగు ప్రధానమైన భాష. అప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక భాషలకు ఏవిధమైన స్థానం ఉండేదికాదు. ప్రజలకు వాక్ స్వాతంత్ర్యం మొదలైన ప్రాథమిక స్వత్వాలు ఏమీ లేకుండెను ఇటువంటి పరిస్థితుల్లో గోలకొండకు పూర్వమే నీలగిరి తెలుగు పత్రికలు రెండు మూడేండ్లు నడిచి ఆగిపోయినవి. కాని గోలకొండ పత్రిక మాత్రం 1947 వరకు ద్వైవార పత్రికగా నడిచి దినపత్రికయై తరువాత సుమారు 20 సంవత్సరాలపాటు వెలువడినది. ఆ రోజుల్లో హైదరాబాదు పత్రికలకు ప్రజలు, ప్రజల ఉద్యమాలతో సంబంధం కలిగినవారు సంపాదకులుగా ఉండే