హైదరాబాదు పరిశ్రమలు
27 - 4 - 1929
మన ప్రభుత్వమువారు హైద్రాబాదు పరిశ్రమల యభివృద్ధికై యొక కోటి రూపాయీలు ఇచ్చియున్నారని వినుటకు చాల సంతోషమగుచున్నది ఈ కోటి రూప్యములీ క్రింది విషయములందు వ్యయపఱచుట వారి యుద్దేశమై యున్నది
1. గృహ పరిశ్రమలకు (Cottage Industries).
2. పరిశ్రమ యంత్రముల పరిశోధనకు
3. రాష్ట్రములోని యార్థిక పారిశ్రామిక విచారణకు .
4. పరిశ్రమ పరిశోధన సహాయమునకు.
5. ఇచ్చటగాని బయటగాని యువకులు పరిశ్రమలకై యభ్యసించిన వారికి సహాయము చేయుటకు.
ఈ యుద్దేశములు నిరభ్యంతరముగా నుత్తమమైనవి ప్రతి దేశము నేటి కాలమున పరిశ్రమలపై విశేషముగా నాధారపడియున్నది మన రాష్ట్రములో నింతవరకెవ్వరు పరిశోధక పండితులుగాని, శాస్త్ర పరిశోధకులుగాని, చారిత్రక పరిశోధకులుగాని, నూతన వస్తు నిర్మాతలుగాని (Inventors) యుత్పత్తి గాకుండుట చూడ నాశ్చర్యముగా నున్నది. లేకున్న నేటేట డజనుల కొలదిగా విద్యార్థులు విదేశములకున్నత విద్యానిమిత్తమై పోయి ప్రతి సంవత్సరమును లక్షల కొలదిగా సర్కారు వారి ద్రవ్యమును తినినను లాభము లేక పరిణమించుచున్నది. నిజాము రాష్ట్రములో నేత పరిశ్రమ మున్నగు పరిశ్రమలు సర్కారు వారిచే ఏల నడుపబడును? వాణిజ్యాది శాఖ యొకటి యున్నది. కాని యింతవరకు చెప్పుకొనగలిగినంతటి ఫలితము మనకు గనుపించలేదు.