Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఫాదిరిల దౌర్జన్యము

23 - 3 - 1929

నిజామాబాదు జిల్లాలోని ఆర్మూరు తాలూకాయందు ఇబ్రాహీం పట్టణము, వేశకొండ మున్నగు గ్రామముల ప్రజలు మహాఘనత వహించిన నిజాము ప్రభుత్వము వారి ప్రభుత్వసభ (బాబెహూకూమతు) పేర పంపుకొనిన యొక సంఘ విజ్ఞప్తి మా కార్యస్థానమునకు వచ్చినందున దానిని వేరొక తావున ప్రకటించి యున్నాము

ఈ విజ్ఞప్తిలో క్రైస్తవ మత బోధకులు గ్రామస్థులను తిప్పలు బెట్టు చున్నట్టును, వారి మత కట్టుల నాచరించుట యందాటంకములు కలిగించు చున్నట్టును, స్త్రీలు నీరు తెచ్చుకొనుచుండ వారిని బుద్ధి పూర్వకముగా నంటుకొని వారి నపవిత్రపరచుచుండే నట్టును, బలవంతపెట్టి జనులవద్ద నుండి చందాలు వసూలు చేయుచుండి నట్లును ఇంకెన్నెన్ని యో అవాచ్యములగు పనులు జరుపుచున్నట్టును తెలియు చున్నది ప్రభుత్వము వారికి పంపుకొనబడిన ఈ విజ్ఞప్తియందు అబద్ధము లుండగూడదు ఇందలి యంశములను కొంత అతిశయోక్తులుగా దలచినను, యదార్థముగా నిర్ణీతమగు భాగము కూడ చాల భయంకరమును, మతసహిష్ణుతకు భిన్నమును, క్రైస్తవ మతబోధకులందు కనబడు ఉత్తమ సాత్త్విక వర్తనమునకు విరుద్ధముగను ఉన్నది విజ్ఞప్తిలో చెప్పబడిన చర్యలు ఇతర మతస్థుల వలన తరచుగా జరిగియుండుట వినుచున్నాము. కాని క్రైస్తవ మతబోధకులిట్టి పద్ధతులు తమ మత వ్యాప్తికై యవలంబించుట విని యుండలేదు. అధమ పక్షమున ఈ రాష్ట్రమున నీ సంగతులు అకృత పూర్వములు. ఇట్టి స్థితిలో నేటి కాలమున, ఇరువదవ శతాబ్దమున నిజాము రాష్ట్రములో క్రైస్తవ మత బోధకులు ఈ నవీన మార్గము నవలంబించుటకు కారణము సూక్ష్మముగా నాలోచింపదగి యున్నది.