పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లోనికి రాకుండా ఎర్పరచిన కట్టుబాటు ఇది. ఈపురిటినీళ్ళనాడు ఇరుగు పొరుగువారు బందుమిత్రులు ఒక్కొక్క ఇంటినుంచి ఒక్కొక్క బిందె నీళ్ళు, నలుగుపిండి, పసుపుముద్ద పంపుతారు. అంటే ఈ పదిరోజుల మురికి పరిశుభ్రతకు నీళ్ళు, నలుగుపిండి విశేషంగా అవసరం అవుతాయి. కావున ఒకే ఇంట్లో అన్నినీళ్లు లభ్యంకాకపోవచ్చు - అందువల్లనే ఈ సహకారాన్ని సంప్రదాయంపేరుతో యిలా అందిస్తారు.

అలాగే అవరైనా చనిపోతే ఆ వంశంవారు పదిరోజులు మైల పడతారు. పదవరోజున దిన కార్యక్రమానికి వంశంలో ఇంటికి ఒకరు హాజరై ఊరిచివర చెరువులోగాని, కాలువలోగాని అందరూ కలిసి స్నానంచేసి, శుద్ధి కార్యక్రమంలో పాల్గోంటారు. ఆ రోజు దినకార్యానికి వారందరికీ భోజనం పెట్టాలి. కారణం - అందులో ఇతర గ్రామాలనుంచివచ్చినవాళ్లుంటారు. దీనిని తట్టుకొనుటకు సహాయంగా ఆ వంశం వారు ప్రతి ఇంటినుంచి బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు, పెరుగు తమ మనిషికి సరిపడా ఒక కావిడిలో వేసి ప్రతి ఊరునుంచి, ప్రతీయింటినుంచీ పంపిస్తారు. ఇది ఒక సానుభూతి ప్రక్రియగానే కాకుండా ఆర్ధికంగా ఆ యింటివారిని ఇబ్బంది పడకుండా చేస్తుంది.

8. రచ్చబండ తీర్పులు:

కుటుంబ తగువులు, ఇంటి తగువులు, పొలం తగువులు, వ్యక్తుల మధ్యతగువులు వారిలో వారే పెద్దలను నిర్ణయించుకొని వారిద్వారా రచ్చబండమీద పరిష్కరించుకుంటారు. దీనినే రచ్చబండ తీర్పులు అంటారు. అన్ని కులాలవారూ ఒకరినొకరు అన్నా, బావా, మామా, అక్కా, వదినా, అత్తా అని వరసలుపెట్టి పిలుచుకుంటూ కలిసి మెలసి బ్రతుకుతారు. పెద్దలు వీరి తగువులలోని లోతులు తెలుసుకొని నిష్కపటంగా తీర్పులు చెపుతారు. అందుకే అవి అందరికీ శిరోధార్యం - ఖరీదులేనివి. *"నిరక్షరాస్యులు అజ్ఞానులుకారు. జ్ఞానాన్ని సంపాదిచుకోడానికి అక్షరాస్యత ఒక అవకాశం మాత్రమే. కనుకనే జానపదు;లు అజ్ఞానులు కారు-అనుభవజ్ఞలు. అనుభవం మనిషికి జ్ఞానాన్ని యిస్తుంది.


  • 'ఆంధ్రుల జానపద విజ్ఞానం ' లోని 'తొలి పలుకు ' డా|| ఇరువెంటి కృష్ణమూర్తి