పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/454

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పోయేది. దీనిని కొందరు అయిరేడనీ కొందరు అయిలేడనీ, అంటుంటారు. తరువాత దఫదఫాలుగా యిలాగే ఊరేగింపుగా పళ్ళేలనిండా బియ్యం, స్యయంపాకాలూ తీసికెళ్ళి యిచ్చి కుమ్మరియింటినుండి అవిరేడుకుండలు, పూజారియింటినుండి బాసికాలు, చాకలియింటినుండి మధుపర్కాలు, పూసలాళ్ళయింటినుండి నల్లపూసలూ,లక్కజోడు, కంసాలి యింటినుండి మంగళసూత్రాలూ తెచ్చేవారు. ఊరందరికీతెలియజేయడానికిగాను యీ ఊరేగింపు ఒకోసారి ఒకో వీధంట వెళ్ళేది. వీనిలో అవిరేడుకుండలు తెచ్చేటప్పుడు బహుచోద్యంగా ఉండేది. ఈ కుండలపై నలుపు, తెలుపు, పచ్చ, బ్రౌన్ రంగులలో అందమైన డిజైన్లూ, బొమ్మలూ వేయబడివుండేవి. ఒక్కొక్కరూ ఒక్కొక్కకుండ మూతివైపు చాతీకి అనించుకుని వెనుకవైపు చేత్తోపట్టుకొని నడుస్తుంటే రంగురంగుల హరివిల్లులా ఊరేగింపు రమణీయంగావుండేది. ఆఖరున వచ్చే పెళ్ళివారికి అదురు సన్నాహంగా ఊరిపొలిమేరదగ్గరకు బాజాబజంత్రీలతో వెళ్ళేవారు. ఈ బాజాభజంత్రీలలో ముఖ్యంగావుండేవి దూదేకులవానిబాకా, పీరుసాయిబుతాసా, మంగళ్ళవీరబాలు, రామడోలు మేళం, సన్నాయిమేళం, మాదిగడప్పులు, ఆడప్పులమధ్య ఎరుకలవాని నాటుతుపాకీపేల్పులు వీనితో ఊరంతా మారుమ్రోగిపోయేది. అవతలినుంచివచ్చేది పెళ్ళి కొడుకయితే ఒకటాపులేనిపల్లకీలోనూ, పెళ్ళికూతురయుతే సవారీలోనూ (మీనా) కూర్చుండబెట్టి తీసికొచ్చేవారు. వీరితో ఒకతోడగుడ్డామెకూడా వచ్చేది.

     ఈ పల్లకీ సవారీలు వోం వోం వోం ఓహో అంటూ చాకళ్ళు మోసుకొచ్చేవారు. సవారీ ప్రక్కన సాయీంబు తూ ... ... అంటూ పిల్లసన్నాయి ఊదుతూ నడిచేవాడు.  ఇలాగ యించుమించు ఊరిలో అన్నికులాలవారూ యిందులో పాల్గొనడం యీ పెళ్ళిళ్ళ విశేషం.  కొందరు ఈ ఊరేగింపును "ఊరేగింపు"గా పేర్కొన్నారు.  అంటే ఊరికి ఆ వధువు లేక వరునిపరిచయం చెయ్యడమన్న మాట.  పేండ్లికొడుకుయింట పెండ్లయితే పెళ్ళి కూతురువారు తోడుగా సారెకూడా తెచ్చేవారు.  అది కొబ్బరికాయలు, అరటి గెలలు, గుమ్మడికాయలు, పసుపు, కుంకుమ, బియ్యం, అపరాలు, పట్టుచీరలు, పంచెలజామార్లు వగైరా ఇవి కావిళ్ళకు ఆటూయిటూ కనబడేలా కట్టుకొని కూడామోసుకువచ్చేవారు వారివనక. ఇవన్నిటితో యీఊరేగింపు (ఊరేరిగింపు) ఒక అందమైన ఆకృతితో మహోత్సాహంగా సాగేది.