పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రతియింటికీ పెరటిలో తోట పల్లెటూళ్ళలో కనుపించే ఒక సుందర దృశ్యం. ఇవి ఆహార విహారాలకే కాకుండా ఆదాయాన్నికూడా సమకూరుస్తాయి. అందులో నాటిన ప్రతిమొక్కా ఆరోగ్యరీత్యానో ఔషధపరంగానో ఏదో ఒక పరమార్థం కలిగివున్నదే. ముఖ్యంగా తులసి, ములగ, పసుపు, ఉసిరిక, కరివేపాకు, బొప్పాయి, నిమ్మ, అరటి, కొబ్బరి చెప్పుకోదగ్గ చెట్లు - అలాగే దొండ, కాకర, బీర, ఆనప, పొట్ల,గుమ్మడి, వంకాయ, బెండకాయలాంటి కూరగాయలు, బచ్చలి, తోటకూర, గోంగూర, పొన్నగంటికూర వంటి ఆకుకూరలు విస్తారంగా పెంచుతారు.

                            తు ల సి

దీనిని పూజిస్తే పుణ్యం పురుషార్ధం వస్తుందనేది ఒక అలౌకిక దృష్టి. సైన్సుదృష్ట్యా యిది దోమల నివారిణి. దీని ఆకు జీర్ణకారి. పైత్యవికారం తగ్గిస్తుంది. డజను తులసాకులూ రెండు మిరియపుగింజలూ కలిపి తింటే పడిశం తగ్గుతుంది. తులసిఆకు పసరు చర్మంమీది తెల్లమచ్చలకు, కురుపులకు దివ్యౌషధం.

పౌరాణీకంగా యీ దళానికి ఒక విలువుంది. కృష్ణ తుల్లాభారంలో దీనిపాత్ర అపూర్వం. శ్రీకృష్ణుని బరువు తూయడానికి సత్యభామ నగలన్నీ చాలలేదు. ఒక్క తులసిదళంతో సరితూగాడట. రామదాసు శ్రీరాముణ్ణి 'చారు తులసీదళధామ ' అంటాడు. చిలకర్తివారి 'గణపతి ' దీనికి అర్ధం 'చారులో తులసిదళంవేసుకొని త్రాగడం ' అని చెప్పినప్పుడు నవ్వువస్తుంది. కానీ పైత్యవికారం ఎక్కువగా ఉన్నప్పుడు తులసాకు ఏరూపంలో తిన్నా పైత్యాన్ని తగ్గిస్తుంది.

                        ము ల గ

ములగకాడలో విటమిన్ 'ఎ ' ఎక్కువ. ఖనిజలవణాలు, మాంసకృత్తులు సకృతుగా గల బలవర్ధకాహారం. అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు ములగాకు, తెలగపిండి కూరవండి పెడతారు ఆపేరుమీదనైనా ప్రసాదంగా అది తిని బలవంతులవుతారని. రాలిపోయిన ములగపువ్వు ఏరి, పప్పులో వేసుకుని వండుకుంటారు. ములగచెట్తు బెరడు గుండకొట్టి