పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/139

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఓరుగల్లున వీరలాంచనముగా పలు శస్త్ర శాలలు నిల్పినారు" అని ఆంధ్ర పౌరుష ప్రశస్తిలో తెలిపిన శస్త్రశాలలు కాలగర్భంలో కలిసిపోయినా కాకతీయుల పౌరుష ప్రతాపాలకు ప్రతీకలుగా శిలలో మలిచిన సింహాలూ, ఏనుగులూ, యిప్పటికీ దర్శన మిస్తూనే ఉంటాయి.

ఇక్కడకు దగ్గరలోనే గల హనుమకొండ వేయిస్థంభాల మండపం తెలుగు శిల్ప సరస్వతికి కంఠా భరణం.

                      అ లం పు రం

కర్నూలుకు 20 మైళ్ళదూరంలో తెలంగాణాలోగల యీ ఊరి జోగులమ్మగుడి చరిత్రప్రశిద్ధమైనది. బాదామి చాళుక్యుల కాలంలో క్రీ.శ. 6వ శతాబ్ధిలో వెలసిన ఆలయమిది. గుడిలో అడుగడుగునా గూళ్ళలో అనేక ప్రతిమలు అమితాశ్వర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇక్కడి ఆలయాలలో నవబ్రహ్మలు, జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి, గణపతి, వీరభద్రుడు, శివుడు, చతుర్ముఖ బ్రహ్మలు శిల్పి చాతుర్యానికి మచ్చుతునకలు. ఆలయకుడ్యాలపై రకరకాల జంతువులు, మానవ మిధిన ప్రతిమలు, దశావతారములు, గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులు మనోహరములు. మహిషాసుర మర్ధిని, నటరాజు, నంది ప్రత్రిమలు నయనానందకరములు. ఇక్కడ ప్రత్యేకంగా శిరస్సులేని దిగంబర భూదేవి యోనిదర్శనం గొడ్రాళ్ళకు సంతాన ప్రాప్రి కలిగిస్తుందని ప్రతీతి.

                           లే పా క్షి

"లేపాక్షి బసవయ్య లేచి రావయ్య" రాయలసీమలో రమణీయ శిల్పాన్ని చిందిస్తున్న చోటిది. అనంతపురం జిల్లా ఇందుకూరు తాలూకాలో యిది కుగ్రామమైనా కళా వైశిస్ఠ్యంతో పెద్ద పట్టణాలకు లేని ప్రశస్తి పొందింది. ఇరవయ్యోడడుగుల పొడవు, పదిహేనడుగుల ఎత్తుగల బసవయ్య సాలంకృత ఏకరాతి విగ్రహం విజయనగరం రాజుల కళా పియత్వానికి అర్ధం పడుతుంది. ఇక్కది పూర్ణ పురుషుడు, పద్మినీ జాతి స్త్రీ ప్రతిమలు శిల్ప కళారంగానికే వజ్రకిరీటాలు.