పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/137

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అ మ రా వ తి

"ఆమరావతీ గుహల అపురూప శిల్పాలు" అనే పాట దీన్ని బట్టి వ్రాశారోగాని అక్కడ గుహలు లేవు. బౌద్ధ స్థూపం మాత్రం వుంది. ఆ ఫలకాలపై బుద్ధుని జననంనుండి నిర్యాణం వరకూగల గాధలు, జాతక కధలు లోకోత్తరంగా చెక్కబడ్డాయి. బుద్ధుని ధ్యానముద్ర, బోధివృక్షం, ధర్మచక్రం దివ్యశిల్ప కళా విలసితాలు. వీనితోపాటు నాటి తెలుగు నాగరికతా చిహ్నాలైన ఏనుగులు, సింహాలు, వివిధ మృగాలు, పూర్ణకుంభం అతిసహజంగా మలచబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నంగా స్వీకరించబడినది యీ పూర్ణకుంభమే. ఇవేగాక వివిధ నాట్య భంగిమల్లో చెక్కబడ్డ పలువురు నృత్యకాంతలు వివిధ వాయిద్యాలతో మనోహరంగా కనిపిస్తారు. సభతీర్చిన బుద్ధుడు, శ్రద్ధతో వింటున్న భక్తులు గల ఫలకం మనల్ని కూడా శ్రద్ధాళువుల్ని చేస్తుంది.

ఈ అమరావతి ఒకనాటి ఆంధ్ర రాజధాని ధాన్యకటకం - అదే ధరణికోట. ఇక్కడ కళా ఖండాలలో లండన్ మ్యూజియంలోకి కొన్ని, మద్రాసు మ్యూజియంలోకి కొన్ని, కలకత్తా మ్యూజియంలోకి కొన్ని తరలించబడ్డాయి. మిగిలిన శిల్పాలను శిధిలమైపోతున్న స్థూపంనుండి తొలగించి ప్రక్కనే మ్యూజియంలో అమర్చారు చూపరుల దర్శనార్ధం. ఈ శిల్పం ఆంధ్ర శాతవాహన రాజుల గారాలబిడ్డ. తెలుగు శిల్పుల రత్న కిరీటానికి కలికి తురాయి.

"మూడువందల యేడులమోఘ తపము చేసి
 సృష్టించిరీ స్థూపశిల్పా కృతులు
 సిద్ధహస్తులు మన తెల్గు శిల్పివరులు
 తమ కళాశక్తులన్నియు ధారబోసి"

అని శ్రీ కొండూరి వీర రాఘవాచార్యులుగారు తమ 'అమరావతి ' కావ్యంలో ప్రస్తుతించారు. ఈ శిల్పాలు క్రీ.పూ. 2న శతాబ్ధినుండి క్రీ.శ. 1వ శతాబ్ధివరకూ మూడు శతాబ్ధాలపాటు చెక్కబడ్డాయట.

                       నా గా ర్జు న కొం డ

ఇక్ష్వాకుల కాలంలో నాగార్జునుని ప్రోత్సాహంతో తెలుగు శిల్పులు చెక్కిన చక్కని శిల్పాలకు కాణాచి యిది. అమరావతికి సోదరి.