పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జానపదులలో ఒకరింట ఎవరైనా చనిపోతే ఊరంతా వెళ్ళి సానుభూతి చూపుతూ ఆ శవం శ్మశానానికి వెళ్ళేవరకూ ఎవరింటా పొయ్యిలో నిప్పుకూడా వెయ్యరు - అంటే అన్నంకూడా వండుకోరన్నమాట. ఇదేపట్టణాలలోఅయితే నాగరికులు ప్రక్కవాటాలో మనిషి చచ్చిపోతే కూడా పట్టించుకొరు. తనకు సంబంధం లేనట్లే వ్యవహరిస్తారు. ఇది పూర్తి యాంత్రిక జీవితం. తల్లీ పిల్లలుగాని, తండ్రీ బిడ్దలుగాని మనసు విప్పి మాట్లాడుకోవడం అరుదు. ఎవరి దారి వారిది. ఎవరిష్టం వారిగి. ప్రతివారి తాపత్రయం డబ్బుసంపాదించటం, విలాసాలకూ కులాసాలకు ఖర్చు పెట్టుకోవడం. పేద సాదలకు దానధర్మాలు అనేది కంచుకాగడాతో వెతికినా కనిపించదు. పేరుప్రతిష్టలు వస్తాయనుకుంటే నాయకత్వం గురించి ఇచ్చే చందాలు మాత్రమే కనిపిస్తాయి. ఇవి దానధర్మాలు అనుకుంటే ఆధర్మం. ప్రతిఫలాపేక్షకలిగినవి దానధర్మాలు ఎట్లా అవుతాయి? నాగరిక ప్రపంచంలో వంచన, మోసం ఎక్కువ. ఏమాత్రం అవకాశం చిక్కినా పక్కవాని సొమ్ము అన్యాయంగా బొక్కడానికి ఏమాత్రం సంకోచించరు.

జానపదులది నేటిని గురించే ఆలోచన - నగరికులది రేపటిగురించి ఆలోచన. అయితే నాగరికుల ప్రత్యేక విశేషం అందరూ విద్యారంగంలో నిమ్మగ్నులు కావడం,తార్కికవాదంలో సైన్సుపై దృష్టి నిలిపి మానవ జీవితంయొక్క భౌతికసుఖభోగాలను సమకూర్చుకొనుటకు నిరంతరం అన్వేణ - మరి జానపదులు కోరేది మానసిక సౌఖ్యం. అది ఆధ్యాత్మిక మైనది. నడవడి సహజ సిద్ధమైనది. - నాగరికుల నడవడి పూర్తిగా పరాయి అనుకరణే. నాగరికులు ప్రతీపూటా కూరలు, పచ్చడి, రసం, పెరుగు, అన్నం టేబిల్ మీద పళ్ళాలలో పేర్చుకొని స్పూనులతోనూ, ఫోర్కులతోనూ ఎవరికివారే వడ్దించుకొని తింటారు, కొంతకొంత వదిలేస్తూ, కొంతకొంతతింటూ అదొక ఫేషన్ లాగ. జానపదులలో తల్లిగాని, భార్యగాని అన్నం వడ్డించగా అచ్చట్లూ, ముచ్చట్లూ చెప్పుకుంటూ భోజన సమయాన్ని తమ కలబోసిన ఆలోచనల వేదికగా చేసుముంటారు. తాము తినేది కడుగు పులుసుతొనైనా అది అల్పంగా భావించరు. పఛ్ఛడి కూడే పరమాన్నంగా భుజిస్తారు.