ఈ పుట అచ్చుదిద్దబడ్డది
మరణ మన ధేను వించుక వెఱుపుగొనక
సాహసంబునఁ జూపిన శాంతమునకు
పులియె యద్దిర! పిల్లియైపోయె ననఁగ,
శాంతమున గెల్వరానిది జగతిఁ గలదె?
అంత పులితోడ నీరీతి సనియె మొదవు
'ఓయిపులి రాజ! ఈ పొంతయూరఁ గలఁడు
పాఱుఁ డొక్కడు సన్ను తాచార పరుఁడు
మురిపమున వాడు పెనుపంగ పెరుగుచుంటి.
నిరత మాతఁడు నులివెచ్చనీటఁ గడిగి
కసవుపోచల నా మేనికపటు వోవ
సవరగాఁ దోమి, గంగడోల్ నివిరి దువ్వి
అంటుసంటుల కొనగోట నంటి తివియు.
ఏమి చెప్పుదు నాతని ప్రేమగరిమ?
ఎట్టిరుచిర పదార్థము నేనిఁ దాను
మున్నుగా నాకు పెట్టక ముట్టఁ డెపుడు,
తడవ నేటికి యిప్పు డాగొడవ యెల్ల?
పుట్టె నా కొకతోలిచూలిముద్దు పట్టి
మూడునా ళ్లయిన చనలేదు వాఁడు పుట్టి
బొడ్డుమావియు నూడనిపురిటిపాప
పూరి ముట్టఁడు, త్రావఁడు నీరువట్టు.