ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఒక్క దినమున నా ధేను వూరిబయట
కానలో మేయుచుఁడంగ, కాంచి పొంచి
చెంగు మని యొక్క గంతున చెంగలించి
గోవుపై ఁ బడె నాపులి గోండ్రు మంచు.
గుప్పు మని యిట్లు తనపైకి కొప్పరించి
బొబ్బరింతలు పెట్టు బెబ్బులిని జూచి
కొంచెమేనియు నయ్యావు కుదిలగొనక
ఇట్టు లనియెను ధీరత యుట్టిపడఁగ.
ఆగు మాగుము ఫులిఱేఁడ! యాత్ర మేల?
చిడుముడి యొకింత మాని నేఁ జెప్పఁబోవు
చిన్న విన్నప మొకసారి చిత్తగించి
ఆరగింపుము కడుపార నవల నన్ను.
అనుడు నామాట బెబ్బులి యాలకించి
వెఱగుపాటును నివ్వెఱ పెనఁగొనంగ
మీఁది కెత్తిన కే లట్టె మీఁద నిలిపె
చిత్తరువులోని బొమ్మ నా చేష్ట లుడిగి.
కోలుపులి యంట, ఆకలి సోలె నంట,
చియ్యబట్టినయావు చేఁజిక్కి నంట,
నిలువు మన నావు, పులి యట్టె నిలిచె నంట,
ఎన్న డేనియు వింటిమే యిట్టివింత?