Jump to content

పుట:Go Geethamu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోగీతము

అనఁగనఁగ నొక్క చక్కని యావు కలదు,
కుఱుచకొమ్ములు బదువైన గుల్ల పొదుఁగు
మెత్తనై కుఱుమట్టంపు మేను కలిగి
కనులపండువు సేయు నాగంగిగోవు.

పొడువ దెవ్వరి, కయ్యంబుపొంతఁ బోదు,
చెనఁటియావులతో చెల్మి చేయ దెపుడు
బుడుతఁ డైనను పిదుకుచో పొదుఁగు చేపి
కుంభ ధారగ క్షీరముల్ కురియఁజేయు.

మిసమిసని దానినిద్దంపుమేను జూచి
మవ్వ మగు దాని గికండకొవ్వు జూచి
పోతరించిన దానిమూపురము జూచి
గండుపులి యొండు దానిపై కన్నువైచె