Jump to content

పుట:Go Geethamu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కన్ను గానక కూళనై యిన్ని నాళ్ళు
కూల్చితిని జీవరాసుల కోట్లకొలఁది,
కట్ట! నిను గూడ నా పొట్టఁ బెట్టికొనుచు
ఘోరనరకానలంబునఁ గూలఁ జాల.

నీదు ధర్మమె నినుగాచె, నేను నిన్ను
గాచిపుచ్చితి ననుమాట కల్ల, నేను
నిన్ను గెలుచుట యటు లుండె, నీవె నన్ను
గెలిచికొంటివి సత్య వాగ్విభవకలన.'

అనుడు ధేనువు వచియించె వ్యాఘ్రరాజు!
ఏల యీరీతి పలికెద? వేను మున్ను
ధారవోసితిఁ గాదె యీ తనువు నీకు
చింత యేమిటి కింక భక్షింపు మయ్య.

ఈవు నను గాచి విడువ, నే నింటి కేగఁ
గాంచి, ఈయావు పులి గికురించి వచ్చె
మాయురే! ఎంతమాయలమారి!' యంచు
నెల్లిదంబులు సేయరే యెల్లవారు?

అకట! సడికంటె చావు మే లగును గాని
చారుతరలీల నీకు నాహార మగుచు
కాయ మర్పించుటో, అట్లు గాక యున్న
జీవముల బల్మిఁ దొరఁగుటో చేయుదాన.'