ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అఱ్ఱు పై కెత్తి గంగకోల్ బిఱ్ఱబిగియ
పుండరీకముపొంతకుఁ బోవ, వ్యాఘ్ర
ముస్సురను రని పెద్దనిట్టూర్పు పుచ్చి
మార్మొగము వెట్టి వెనకకు మరలిపోవు.
అంత నీరీతి పులితోడ ననియె సురభి
కాదో యాకలి? నామీఁద కాంక్ష లేదొ?
నాదుమాంసము వాచవి గాదొ? యిట్లు
దెసలు జూచెద వేటికి తెల్లబోయి?
ఆకటకు స్రుక్కి వాడివ త్తయ్యే నొడలు,
కడుపు వీపున నంటె నప్పడము వోలె,
జాల మేటికి? నాదుమాంసమ్ము మెసవి,
పుణ్యలోకంబులకు సన్న బుచ్చ నయ్య.
ఆవు గావించు తెగునకు నదరిపడుచు
ఎట్టకేలకు శార్దూలమిట్టు లనియె,
పుడమి పై నేను పులి నయి పుట్టి పెరిగి
యిట్టిధీకత గంటినే యెన్న డైన?
అకట! నీయట్టి మహితాత్ము లైనవారి
బట్టి వధియించి దురితంబు గట్టికొనుట
కంటె, లొడితెడు పొట్టకై కాయగసరు
మెసవి మునివృత్తి మసలుట మేలు కాదె!