ఈ పుట అచ్చుదిద్దబడ్డది
వ్యాఘ్రరాజమ! నీచేసినట్టి మేలు
మఱన శక్యమె యెన్ని జన్మముల కైన?
నీదయారసకలనచేఁ గాదె యేరు
బుజ్జగించితి సుతునకు బుద్ధి సెప్పి.
నాదుకోరిక దీఱెను, నీదుకోర్కి
యింక దీఱఁగ నా దేహ మిదిగొ నీకు
ధారవోయుచునుంటిని, తనివిదీఱ
నారగింపుము తడవు సేయంగ నేల?'
అనుచు నీరీతి తనతోడ నావు పలుక,
చిత్ర మది యేమొ! పులి యంత చేష్ట లుడిగి
తేకువను గోలుపోవు, వితాకు జెందు,
కనుల నటె విచ్చి వెడవెడ గాంచు బయలు.
ఎదుట నిలిచిన యాపుఁ గన్నెత్తి కనఁడు,
గడగడ వడంకు, బాష్పముల్ కనుల నించు,
గొణుగుఁ డనలోన, వేదురు గోన్న భంగి
నుండు, తల యూచు, వెచ్చనియూర్పు పుచ్చు.
కరుణ యెట్టిదొ కల నైన నెఱుఁగనట్టి
వ్యాఘ్ర మీరీతి శౌర్యంబు పరిహరించి
దీనవృత్తిని వహియించి మౌనముద్ర
నుంట గనుఁగొని యక్కజ మొంది యావు.