ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తల్లి యీరీతి బోధింప తల్లడిల్లి
దూడ యిట్లనె, అమ్మ! యిట్లాడె దేమె?
దాన మొసఁగెనో, అమ్మెనో, తన తనూజ
కరణ మిచ్చెనో చెప్తును భూసురుఁడు నిన్ను?
ఎటకుఁ బోయెదు? నీవెంట నేను వత్తు
గోవుదూడల నెడ సేయు కుమతి గలఁడె?
నీవు లేకున్న నిముసంబు నిలువఁ జాల
తల్లితోడిద లోకంబు పిల్లలకును.
పేర్మి నన్నింక నెవ్వరు పెంచువారు?
వీక న న్నింక నెవ్వరు నాకు వారు.
కూర్మి న న్నింక నెవరు చన్గుడుపు వారు?
ఎందు బోయెదు న న్నొంటి నింట డించి?'
కనుల జలజల బాష్పముల్ కాల్వ గట్ట
వత్స మీరీతి తనచోడఁ బలుకుచుండ,
జల్లుజల్లని హృదయంబు జలదరింప
సూనుఁ గౌఁగిట గదియించి సురభి యనియె.
జాలి నీలీల వాపోవ 'నేల వత్స?
పాఱుఁ డెవరికి న న్నీయ పాలువడఁడు,
విధినియోగంబుచే నేన వెడలుచుంటి'
అంచు జరిగిన దెల్ల విన్పించె, నంత.