ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తల్లిదండ్రులు నిందించు ప్రల్లదుండు
బంధువులఁ బ్రొవ నేరని బ్రహ్మబంధు
వర్ధిజనములు మనుపని వ్యర్థ జీవి
అల్పజంతువులకు హింస సల్పు ములుచ.
పరసతులఁ బట్ట మంకించు పరమపాపి
అన్యధనములఁ గాంక్షించు నట్టి చెనటి
చెలుల నమ్మించి ద్రోహంబు చేయు పలున
అరులు కాటిని వెన్నిచ్చు పిఱికి పంద,
తిన్నయింటికి వాసాల నెన్ను తులువ
అప్పు లొనరించి యెగఁ బెట్టు నాక తాయి
కూటసాక్ష్యము లిచ్చెడు కుటిలబుద్ధి
కొండియంబుల నాడెడు కుత్సితుండు,
అతిథు లింటికి నే తేర నన్న మిడక
కుక్షి నిండంగఁ గుడుచు కక్కూర్తి కాండు
తాను గుడువక యొరులకు దాన మీక
పసిఁడి కుప్పలుగాఁ గూర్చు పిసినిగొట్టు,
అగ్ని సాక్షిగ పరిణయమాడినట్టి
కులసతిని వీడి వెలయాలిఁ గూడు కూళ
కడుపుకూటికై కాటికి కాళ్లు సాఁచు
ముదుసలికి కూఁతు తెగనమ్ము ముష్కరుండు