ఈ పుట అచ్చుదిద్దబడ్డది
కఱకుఱా లైన జాలిచే కఱఁగఁ జాలు
ఆవు పలికినపలుకుల నాలకించి
ఇట్లు వచియించె బెబ్బులి యెట్ట కేని
హృదయమున ప్రేమలతికలు ఱేకులెత్త.
"ఏను నిను వీడ చయ్యన నింటి కేగి
పుత్ర మోహంబు కడుపార పొంగిపొరల
మగుడ వత్తువో రావో నమ్మంగఁ జాల
శపథ మేమి యొనర్తువో చెప్పుమ గోవ!'
అనుడు మోమున దరహాస మంకురింప
పులికి వందన మొనరించి పలికె నావు
బళిర! నీ మేలు మఱపంగఁ గలనె యెపుడు?
వినుము నే నిచే బాస గావించు చుంటి.
గోవులను పస్తువెట్టెడి కూళగతికి
గొడ్ల ముకుత్రాళ్ళ బంధించు కుజనుగతికి
చూడ లేనావు పితికిన దుష్టుగతికి
పోవుదానను నే రాకపోతి నేని.
దేవదూషణ సేయు నాస్తి కునిగతికి
గురుల ధిక్కార మొనరించు కుమతిగతికి
సాధువుల బాధపెట్టు నృశంసుగతికి
పోవుదానను నే రాకపోతి నేని.