Jump to content

పుట:Go Geethamu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నావు డామాట లాలించి యావు పలికె
అలుకమై తన్ను గద్దించు పులిని జూచి
పులుకుపులుకున కన్నీరు తొలకరింప,
పలుకుపలుకున దైన్యంబు గులకరింప.

అగునె నీ విట్టు లాడంగ వ్యాఘ్రరాజ?
పశుగణంబుల యందును పక్షులందు
పలుకు తిరుగక చరియించువారు లేరె?
బోయ కీయదె తన మేను మును కపోతి?

ఆడి తిరిగిన చండాలుఁ డండ్రు గాని
కులము చండాలుఁ డైనను కొఱఁత లేదు
ఆడి తిరుగక యుండెనా వాఁడె పుడమి
పూజ్యుఁ డరుమాట విన లేదె పులుల ఱేడ!

కడుపుతీపుకొలందిని నుడివియుంటి
నీ నెఱుంగనిధర్మంబు లెందుఁ గలవు
పోయి రమ్మని యందువా పోయివత్తు
అట్లు గాకున్న నీ కొక్క యడ్డు గలదె?

అతిధి సత్కారమునకంటె సధికఫలము
కలుగ దంచు వచింతురు గాదె బుధులు:
కాన నీ కిదె నా మేను కాన్క యిత్తు
కాంక్ష దీఱ భుజింపుము కడుపునిండ.'