ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చిన్ని పాపకు మున్నుగా చన్ను గుడిపి
అవల నియాకలిని దీర్తు వ్యాఘ్ర రాజ!
ఇంతమాత్రము చనవు నా కియ్య నయ్య
పుట్టకుండునే డయ నీకు పులిన యైన?
పుడమి గోవులమై మేము పుట్టినపుడే
వ్యాఘ్రముల కామిషంబుగ నజుఁడు మమ్ము
చేసెఁ గావున దీనికై చింత యేల?
భోజ్యమను నేను వ్యాఘ్రమా! భోక్త వీవు."
అనుచు నీరీతి వచియియించు నావుఁ జూచి
వికటముగ నవ్వి మువ్వన్నె మెకము పలికె
ఏటి కీమాట లాడెద? విట్టిపలుకు
లెవ్వ రైనను విన్నచో నవ్వ రొక్కొ?
ఒరులచేఁ జిక్కి, మడియంగ నున్న వేళ
ఏయుపాయంబు పన్నియో యెట్టు లైన
తనదుప్రాణంబు గాపాడఁ బెసఁగుఁ గాని
సమ్మతించునే చావ సేజంతు వైన?
నోటఁ జిక్కినజంతు వేనాఁట నైన?
విడిచె పులి యంచు వింటివే వెఱిగోవ?
కోరి తనుదాన బెబ్బులినోరఁ గవియు
జంతు వెందైన నుండునే జగతియందు?