పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/86

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ప్రణయాంజలి


ఇంతయప్పుడె యితరమ్ము నెఱుగనట్టి
విమలమతి నిన్ను ప్రేమించి విఫలమొంది
మరణమునకయి చూచుచు మ్రగ్గుచున్న
స్నేహితుని ప్రణయాంజలిం జేకొనుమిదె!
    మెఱుపుదీగె మొగిలుతోడ మేలమాడు
    నట్లు చిరునవ్వుల న్నన్ను నలరజేసి
    ప్రాణములకన్న నీవె నా ప్రాణ మనుచు
    మురియుచుండగ నన్నింత మోసగింతె?
ఆకసముదాక బొంగెడు నాసలెన్నొ
వనిత! నీ చెంత సఫలమ్ము బడయ నెంచి
మురియుచుండగ నన్నింత మోసగించ
న్యాయమౌనటె చెలియ అన్యాయముగదె?
    పోనిలే, అంతదయ నీకు బుట్టకున్న
    కర్మమని యెంచి గడపెద కాలమెట్లొ
    ఎంచియొ యెంచకో ప్రేమ నించినాను
    బతికినను చచ్చినను నాదు ప్రాణ మీవె.